Singer Kalpana Suicide | ప్రముఖ నేపథ్య గాయని సింగర్ కల్పనా రాఘవేందర్(Kalpana Raghavendar) ఆత్మహత్యాయత్నానికి సంబంధించి కేపీహెచ్బీ పోలీసులు స్టేట్మెంట్ని రికార్డు చేస్తున్నారు. ఇప్పటికే కల్పన భర్త ప్రసాద్ని అదుపులోకి తీసుకుని స్టేట్మెంట్ని రికార్డు చేసిన పోలీసులు తాజాగా సృహలోకి వచ్చిన కల్పన స్టేట్మెంట్ని రికార్డు చేస్తున్నట్లు తెలుస్తుంది.
కల్పన తన పెద్ద కూతురిని చదువు విషయంలో హైదరాబాద్కు రమ్మని కోరగా.. తాను రానని చెప్పినట్లు సమాచారం. తనకు హైదరాబాద్ రావడం ఇష్టలేదని కేరళలోనే ఉండి చదువుకుంటానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలోనే మంగళవారం ఉదయం వీరిద్దరి మధ్య ఫోన్లో తీవ్రమైన సంభాషణ జరిగినట్లు సమాచారం. ఈ వాగ్వాదం తర్వాత కల్పన తీవ్ర మానసిక ఒత్తిడికి గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రోజూ తీసుకునే నిద్రమాత్రలను అధిక మోతాదులో వాడినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5:00 గంటల సమయంలో ఆమె భర్త ప్రసాద్ ఫోన్ చేసినప్పుడు కల్పన స్పందించలేదు. దీంతో ఆయన విల్లా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విల్లా సెక్రటరీ ఇంటికి వచ్చి చూసిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చిన వెంటనే కల్పనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.