Raj-Koti | ప్రాణ స్నేహితుడు, సహచర సంగీత దర్శకుడు రాజ్ మరణ వార్త తెలిసిన మరో సంగీత దర్శకుడు కోటి కన్నీటి పర్యంతం అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో రాజ్ కన్నుమూశారు. రాజ్ మరణ వార్త తెలియగానే కోటి భావోద్వేగానికి గురయ్యారు. రాజ్ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. సంగీత ప్రపంచానికి రాజ్-కోటి ద్వయం పలు అద్భుతమైన పాటలు అందించింది. ఇద్దరూ కలిసి చేసిన పలు సినిమాలు.. వాటిలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్.
‘నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నా. నా రాజ్ మరణించారనే వార్త జీర్ణించుకోలేకపోతున్నా.. ఇటీవలే ఓ సినిమా పంక్షన్లో మేం కలుసుకున్నాం. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని నాకు అనిపించలేదు. రాజ్ కూడా చెప్పలేదు. కానీ ఈ రోజు గుండెపోటుతో ఆయన మరణించారని తెలిసి ఎంతో బాధగా ఉంది. రాజ్-కోటిగా మేం ఇద్దరం పలు సినిమాలకు పని చేసి.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం విడిపోయిన తర్వాత కూడా కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటినీ రాజ్-కోటి పాటలు అనే వారు. మేమిద్దరం 24 గంటలూ పని చేసేవారం. చక్రవర్తి వద్ద మేమిద్దరం అసిస్టెంట్లుగా పని చేశాం’ అని కోటి తెలిపాడు.
‘ముఠా మేస్త్రి, హలో బ్రదర్ వంటి ఎన్నో సినిమాలకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చాం. తెలుగులో మేం ఓ ట్రెండ్ క్రియేట్ చేశాం. ఈ రోజు నా రాజ్ లేడనే వార్త ఎంతో బాధగా ఉంది. మా పాటల రూపంలో నా రాజ్ కలకాలం ఉంటాడు. కాల ప్రభావం, పరిస్థితుల వల్ల మేం విడిపోయాం. నేను ఎన్ని సినిమాలు చేసినా రాజ్ నా పక్కనే ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగా.. రాజ్‌కి నేనొక తమ్ముడి వంటి వాడిని. చిన్ననాటి స్నేహితులం. మేం ఇద్దరం విడిపోవడం ఇప్పటికీ నాకు బాధగానే ఉంటుంది. వద్దురా విడిపోవద్దు అని అన్నాడు. నాటి పరిస్థితుల వల్ల విడిపోయాం. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటాడు’ అని కోటి కన్నీటి పర్యంతం అయ్యారు.
ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రముఖ సంగీత దర్శక ద్వయం ‘రాజ్-కోటి’ల్లో ‘రాజ్’ ఇక లేరు అని తెలవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ గల రాజ్.. నా కెరీర్ ప్రారంభ దశలో నా చిత్రాలకు అందించిన బాణీలు.. ఆయా సినిమాల విజయంలో ప్రముఖ పాత్ర పోషించి.. ప్రేక్షకులను నన్ను మరింత దగ్గర చేర్చాయి. రాజ్ అకాల మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం.. ఓం శాంతి!’ అంటూ ట్వీట్ చేశారు.