అగ్ర కథానాయకుడు దుల్కర్ సల్మాన్‌కి చెందిన వేఫేరర్ ఫిలింస్ సంస్థ నిర్మించిన తాజా చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు. మలయాళ సినీచరిత్రలో ముందెన్నడూ చూడని భారీ స్థాయిలో ఈ సినిమా నిర్మించామని, భారతదేశంలో వచ్చిన తొలి లేడీ సూపర్ హీరో చిత్రమిదని, అత్యున్నత సాంకేతిక పరిపూర్ణతతో ఒక నిర్మాతగా దుల్కర్ సల్మాన్ అసాధారణమైన అడుగు వేశారని, మలయాళ సినిమా స్థాయిని పెంచిన సినిమా ‘కొత్త లోక’ అని చిత్రబృందం పేర్కొన్నది.
కల్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక సితార ఎంటైర్టెన్మెంట్స్ సంస్థ ద్వారా రెండు తెలుగు రాష్ర్టాల్లో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తున్నదని, ఘన విజయం దిశగా దూసుకుపోతున్నదని సితార సంస్థ వారు శనివారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. నస్లెన్, శాండీ, చందు సలీం కుమార్, అరుణ్ కురియన్, విజయ రాఘవన్, శరత్ సభ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, సంగీతం: జేక్స్ బెజోయ్.