ప్రస్తుతం మలినేని గోపీచంద్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40శాతం పూర్తయింది. దసరాకు సినిమాను విడుదల చేయాలనే సంకల్పంతో మేకర్స్ ముందుకెళ్తున్నారు. ఇదిలావుంటే.. ఈ సినిమాతో పాటు సమాంతరంగా కొరటాల శివ సినిమాను కూడా బాలకృష్ణ చేయబోతున్న విషయం తెలిసిందే. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నది. ముందుగా యాక్షన్ సీక్వెన్స్‌తో షూట్‌ని మొదలుపెట్టనున్నారు కొరటాల. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో వస్తుందని సమాచారం. ఈ ఎపిసోడ్లో బాలకృష్ణ లుక్‌ని కొత్తగా ప్లాన్ చేశారట కొరటాల.
ఇందులో భాగంగా బాలకృష్ణ హెయిర్ స్టైల్‌పై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ బాధ్యతను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌కి అప్పగించారు. ఆయన పాత్రకు తగ్గట్టుగా ఓ కొత్త హెయిర్ స్టైల్‌ని బాలయ్య కోసం డిజైన్ చేస్తున్నారట. హెయిర్ స్టైల్‌తో పాటు, బాలకృష్ణ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఈ ఎపిసోడ్లో భిన్నంగా ఉంటుందని వినికిడి.
మొత్తంగా అల్ట్రా స్టైలిష్‌గా, పక్కా మాస్ అవతారంలో బాలకృష్ణను కొరటాల చూపించబోతున్నారు. ఈ సినిమాలో కుటుంబ భావోద్వేగాలు సైతం బలంగా ఉంటాయని తెలిసింది. సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.