శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Jan 13, 2021 , 14:31:28

విజ‌య్ 'మాస్టర్'‌ రివ్యూ

విజ‌య్ 'మాస్టర్'‌ రివ్యూ

తమిళ సినీ అభిమానుల్లో గత కొన్ని నెలలుగా ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాల్లో ‘మాస్టర్‌' ఒకటి. తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకరైన విజయ్‌ హీరోగా నటించిన చిత్రమిది. ‘ఖైదీ’ సినిమాలో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న లొకేష్‌ కనకరాజ్‌ ఈ చిత్రానికి నిర్దేశక బాధ్యతల్ని చేపట్టడం, విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా నటించడంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ఈ సంక్రాంతికి తమిళంతోపాటు తెలుగులో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని  ఏ మేరకు మెప్పించింది ? విజయ్‌కి దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ హిట్‌ ఇచ్చాడా? లేదా? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 


జె.డి(విజయ్‌)  పర్సనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రొఫెసర్‌గా ఓ కాలేజీలో పనిచేస్తుంటాడు. తాగుబోతు అయిన అతడిని కాలేజీ నుంచి పంపించేందుకు  మిగతా సిబ్బంది ప్రయత్నిస్తుంటారు. కానీ జె.డికి స్టూడెంట్స్‌ మద్దతు ఉండటంతో వారు చేసిన ప్రయత్నాలు ఫలించవు. స్టూడెంట్‌ ఎన్నికల్లో జరిగిన గొడవల కారణంగా జె.డి మూడు నెలల పాటు కాలేజీకి దూరమవుతాడు. ఈ సమయంలో వరంగల్‌లోని ఓ జువైనల్‌ హోమ్‌లో టీచర్‌గా పనిచేయడానికి జె.డి ఒప్పుకుంటాడు.  భవాని(విజయ్‌ సేతుపతి) వరంగల్‌లో పెద్ద రౌడీ. బాల నేరస్తుడిగా శిక్షను అనుభవించిన అతడు తన తెలివితేటలతో పెద్ద నేరసామ్రాజ్యాన్ని సృష్టిస్తుంటాడు. తాను చేసే నేరాలకు బాల నేరస్తులను పావులుగా వాడుకుంటుంటాడు. ఓ సంఘటన కారణంగా భవాని బారి నుంచి జువైనల్‌ హోమ్‌లోని బాలల్ని కాపాడే బాధ్యతను జె.డి చేపడుతాడు. జె.డి.లో మార్పుకు దారితీసిన ఆ సంఘటన ఏమిటి? భవానిని ఎదుర్కొని జె.డి తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? ఈ ప్రయత్నంలో అతడికి చారులత(మాళవికా మోహనన్‌) ఎలాంటి సహాయం చేసిందన్నదే ఈ చిత్ర కథ. 


తమిళ దర్శకుల్లో అధిక భాగం సామాజిక ఇతివృత్తాలకు వాణిజ్య హంగుల్ని జోడిస్తూ సినిమాల్ని తెరకెక్కిస్తుంటారు. ఈ సినిమాతో దర్శకుడు  లోకేష్‌ కనకరాజ్‌ అదే పంథాను అనుసరించారు. తొలిసారి విజయ్‌, విజయ్‌ సేతుపతి లాంటి అగ్రహీరోలతో సినిమాచేసే అవకాశం రావడంతో తన శైలికి భిన్నమైన కథను ఎంచుకొని  పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు. చట్టాలలోని  లొసుగులను ఉపయోగించుకుంటూ బాలల్ని అడ్డుగా పెట్టుకొని కొందరు ఎలా నేరాలకు పాల్పడుతున్నారో ఈ సినిమాలో చూపించారు. 

ప్రథమార్థంలో కాలేజీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్ని విజయ్‌ పాత్ర పరిచయం కోసమే వాడుకున్నారు దర్శకుడు. అతడిలోని హీరోయిజాన్ని చాటిచెబుతూ విజయ్‌ అభిమానుల్ని అలరించేలా ఈ సీన్స్‌ సాగుతాయి. వాటికి తోడు భవాని  రౌడీగా మారడానికి దారితీసిన  పరిస్థితులు, జె.డి జువైనల్‌ హోమ్‌కు రావడం, అతడిలో మార్పు వచ్చే సన్నివేశాలతో ప్రథమార్థం చాలా వరకు సరదాగా సాగుతుంది. ద్వితీయార్థాన్ని జె.డి, భవానీ ఒకరిపై మరొకరు వేసుకునే ఎత్తులతో ఉత్కంఠగా తెరకెక్కించారు దర్శకుడు. తన తెలివితేటలతో భవాని వ్యాపారాలకు జె.డి అడ్డుకట్ట వేసే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. 


కాన్సెప్ట్‌ ఓరియెంటెండ్‌ చిత్రాలతో దర్శకుడిగా ప్రతిభను చాటిన లోకేష్‌ కనకరాజ్‌ ఈ సినిమాలో కథ కంటే పూర్తిగా విజయ్‌ ఇమేజ్‌పైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లుగా కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లో ఆ తపనను చాటుతుంది.  కాలేజీ ఎపిసోడ్స్‌తోపాటు జువైనల్‌ హోమ్‌లోవచ్చే ఫైట్స్‌ను విజయ్‌ హీరోయిజాన్ని చాటుతూ ైస్టెలిష్‌గా తీర్చిదిద్దారు. అయితే లోకేష్‌ గత సినిమాల్లో కనిపించిన  స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌, వేగం ఈ సినిమాలో లోపించాయి. కథాగమనం పూర్తిగా నిదానంగా సాగుతుంది.   ప్రయోగాల జోలికి పోకుండా రొటీన్‌ కమర్షియల్‌ పంథాను అనుసరించారు. కథలో విజయ్‌, విజయ్‌ సేతుపతి పాత్రలకు తప్ప మిగతా వారికి ప్రాముఖ్యతనివ్వలేదు.  

విజయ్‌ తనదైన మేనరిజమ్స్‌తో సినిమాలో ఆకట్టుకున్నారు. మాస్టర్‌ పాత్రకు తగినట్లుగా హుందాగా కనిపిస్తూనే అయనలోని మాస్‌ కోణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ విజయ్‌ను కొత్తగా ఈ సినిమాలో చూపించారు. విజయ్‌కి దీటైన ప్రతినాయకుడిగా విజయ్‌ సేతుపతి కనిపించారు. మాటల్లో వ్యంగ్యాన్ని ప్రదర్శిస్తూ విలనిజాన్ని పండించిన తీరు వైవిధ్యంగా సాగింది.   రెగ్యులర్‌ సినిమాల్లో మాదిరిగా డ్యూయెట్స్‌ లేకుండా విభిన్నంగా ఇందులో పాటల్ని సమకూర్చారు సంగీత దర్శకుడు అనిరుధ్‌.  అవన్నీ వినూత్నంగా ఉన్నాయి. విజయ్‌ అభిమానుల్ని మాత్రమే మెప్పించే చిత్రమిది. కథ కొత్తదే అయినా కథానాన్ని నడిపించే విధానంలో నవ్యత లేకపోవడంతో రొటీన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. 

రేటింగ్‌: 2.5/5


ఇవి కూడా చ‌ద‌వండి

మ‌తి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ..ఫొటోలు వైర‌ల్

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?

ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీకి సాయిప‌ల్ల‌వి గ్రీన్‌సిగ్న‌ల్‌..!

స్మిమ్మింగ్ రాదు..కాని స్విమ్మ‌ర్ గా న‌టించా: న‌భాన‌టేశ్‌

క్రికెట్ టీంకు సరిపోయేంత పిల్లల్ని కంటా : ప్రియాంక చోప్రా

సింగర్ సునీత పెళ్లి గిఫ్టుల విలువ తెలుసా..?logo