యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా జరిగిన ప్రమాదంలో తమిళ పాపులర్ స్టంట్ మాస్టర్ మోహన్రాజ్ అలియాస్ ఎస్.ఎం.రాజు (52) దుర్మరణం చెందారు. సోమవారం తమిళనాడులోని నాగపట్నంలో ఈ ఘటన జరిగింది. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘వెట్టువమ్’ చిత్రానికి సంబంధించిన యాక్షన్ ఘట్టాలను ఎస్.ఎం.రాజు సారథ్యంలో తెరకెక్కిస్తున్నారు.
అతివేగంతో నడుపుతున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో అందులో ఉన్న ఎస్.ఎం.రాజు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే యూనిట్ సభ్యులు ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఎస్.ఎం.రాజు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.