Uppal Stadium Security | కలకత్తాలో ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ పర్యటన సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కోల్కతాలో మెస్సీ కొద్దిసేపు మాత్రమే కనిపించడంతో ఆగ్రహించిన అభిమానులు కుర్చీలు, వాటర్ బాటిళ్లను విసిరి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని సాయంత్రం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ (ఫ్రెండ్లీ మ్యాచ్) కోసం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం, హైదరాబాద్ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేయగా.. బలగాలను మరింత పెంచనున్నట్లు తెలుస్తుంది. అలాగే స్టేడియం పరిసరాల్లో భద్రతను పర్యవేక్షించడానికి 450 సీసీ కెమెరాలు మరియు అత్యంత అధునాతన డ్రోన్లను రంగంలోకి దించినట్లు సమాచారం. కోల్కతాలో జరిగిన ఘటన ఇక్కడ పునరావృతం కాకుండా పోలీసులు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు టికెట్లు/పాస్లు ఉన్నవారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని ఇప్పటికే రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు. పాస్లు లేనివారు స్టేడియం వైపు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.