Ram Charan | మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని మెగా పవర్ స్టార్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారాడు. ఇక ఇటీవల గేమ్ ఛేంజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పెద్దగా అలరించలేకపోయింది. ఇప్పుడు పెద్ది అనే సినిమా చేస్తుండగా, ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ మూవీపై అంచనాలు పెంచింది. ఈ చిత్రంతో రామ్ చరణ్ బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఇటీవల రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో రామ్ చరణ్ తోపాటు భార్య ఉపాసన, కుమార్తె క్లీంకార, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ సైతం పాల్గొన్నారు.
వారు చరణ్ మైనపు విగ్రహంతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. రామ్ చరణ్ మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మైనపు విగ్రహం లాంచింగ్ సమయంలో చరణ్ తన మైనపు విగ్రహం పక్కన కూర్చొని ఫొటోలకి పోజులిచ్చాడు. అదే సమయంలో క్లింకార స్టేజ్ ఎక్కేసింది. అక్కడ చెర్రీతో పాటు మైనపు విగ్రహం ఉన్నాయి. ఆ సమయంలో రామ్ చరణ్ దగ్గరకి వెళ్లకుండా క్లింకార మైనపు విగ్రహం దగ్గరకి వెళ్ళబోయింది. ఆ సమయంలో చరణ్ .. క్లింకారని పక్కకి లాగాడు. అయితే క్లింకార ఎవరు తన తండ్రి అనేది తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెంపుడు జంతువుల పట్ల ప్రేమ, కరుణ చూపించే ఇండియన్ స్టార్ గా చరణ్ మైనపు విగ్రహాన్ని పెట్టారు. రామ్ చరణ్ తన పెంపుడు కుక్క రైమ్ పై ఉన్న ప్రేమను అందరికీ తెలిసేలా చేసేందుకు తన విగ్రహంతో పాటూ రైమ్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఎంతో పట్టుబట్టడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ వ్యాక్స్ మ్యూజియంలో క్వీన్ ఎలిజబెత్2 తర్వాత ఈ స్టేట్మెంట్ చేసిన ఏకైక సెలబ్రిటీగా రామ్ చరణ్ అరుదైన ఘనత దక్కించుకున్నాడు. ఇది చూస్తుంటే అందులో రియల్ చరణ్ ఎవరు? మైనపు విగ్రహం ఏదనేది గుర్తు పట్టలేకపోతున్నారు.