గత ఏడాది ‘క’ చిత్రంతో కెరీర్లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు యువ హీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..‘మిర్జాపూర్’ సిరీస్‌తో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు ఆనంద్ అయ్యర్. తాజాగా ఆయన ఓ పాన్ ఇండియా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం కే ర్యాంప్, చెన్నై లవ్‌స్టోరీ చిత్రాల్లో నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సంస్థలో ఓ సినిమా ఖరారైందని తెలిసింది. ‘క’ సినిమా ద్వారా వచ్చిన గుర్తింపు వల్లే కిరణ్ అబ్బవరం బాలీవుడ్ దర్శకుడి దృష్టిలో పడ్డారని, ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజమైతే ఆయన కెరీర్లో మరో మెట్టెక్కడం ఖాయమని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.