‘దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ కథ, అందులోని నా పాత్ర వివరించగానే ఎలాంటి లెక్కలు వేసుకోకుండా వెంటనే అంగీకరించా. ఈ కథ నాకు అంత నచ్చింది. నా నమ్మకాన్ని నిజం చేస్తూ సినిమాను ప్రేక్షకులు కూడా పెద్ద హిట్ చేశారు. ఈ మధ్య చాలా సినిమాలు చేశా. ఈ సినిమా విడుదలయ్యాక వచ్చినన్ని ఫోన్ కాల్స్, మరే సినిమాకూ రాలేదు. మొదటి షో నుంచే అభినందనలు మొదలయ్యాయి. తక్కువ సమయంలో ఎక్కువమందికి రీచ్ అయిన సినిమా ‘కింగ్డమ్’ ’ అని నటుడు సత్యదేవ్ అన్నారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటైర్టెనర్ ‘కింగ్డమ్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటైర్టెన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండకు అన్నగా కీలక పాత్ర పోషించిన నటుడు సత్యదేవ్ ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘గౌతమ్ స్క్రిప్టే ఈ సినిమాకు ప్రధాన బలం.
అన్నదమ్ముల మధ్య సాగే సంఘర్షణను అద్భుతంగా మలిచాడు తను. ఇందులో విజయ దేవరకొండకు అన్నగా నటించా. విజయ్ నా తమ్ముడు అని తెలిసిన తర్వాత.. జైల్లో మా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. సంఘర్షణతో కూడిన సన్నివేశం అది. అందుకే ఛాలెంజ్‌గా తీసుకొని చేశాను. ఇందులోని యాక్షన్ సీన్స్ గురించి అంతా ప్రత్యేకంగా మాట్లాడుకుంటుంటే ఆనందంగా ఉంది. ఎమోషన్స్‌తో కూడుకున్న యాక్షన్ సీన్స్ కావడం వల్లే అవి అందరికీ నచ్చాయి. వాటికోసం శారీరకంగా కూడా చాలా కష్టపడ్డాం.’ అని సత్యదేవ్ తెలిపారు. తక్కువ సమయంలోనే విజయ్ దేవరకొండతో మంచి అనుబంధం ఏర్పడ్డదని, తనని నిజంగానే తమ్ముడిగా ఫీలయ్యానని, విజయ్ మంచితనానికి ఎవరైనా లొంగిపోవాల్సిందేనని సత్యదేవ్ చెప్పారు. మలయాళ నటుడు వెంకటేష్ గురించి కూడా బాగా మాట్లాడుకుంటున్నారని, తనకు మంచి పేరొస్తుందని లొకేషన్లోనే అనుకున్నామని సత్యదేవ్ గుర్తుచేసుకున్నారు. నిర్మాత నాగవంశీ గురించి మాట్లాడుతూ ‘తనకంటూ ఓ ప్రత్యేక పంథాను సృష్టించుకున్న నిర్మాత నాగవంశీ. కథ నచ్చిందంటే దానికోసం ఎంత ఖర్చైనా వెనుకాడరు.. రాజీ పడరు’ అని తెలిపారు.