Kick 3 | టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సురేందర్ రెడ్డి మళ్లీ రవితేజతో చేతులు కలపబోతున్నాడన్న వార్త ఫిల్మ్‌నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ‘అతనొక్కడే’తో ఇండస్ట్రీకి పరిచయమైన సురేందర్ రెడ్డి, రవితేజతో చేసిన ‘కిక్’ సినిమాతో తన కెరీర్లో భారీ టర్నింగ్ పాయింట్ అందుకున్నాడు. ఆ సినిమాకి వచ్చిన అద్భుతమైన స్పందన కారణంగా 2015లో ‘కిక్ 2’ రూపొందినా, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. టైటిల్ తప్పుగా పెట్టడం వల్లే ‘కిక్ 2’ ఫ్లాప్ అయ్యిందని అప్పట్లోనే చాలామంది అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, అఖిల్ అక్కినేనితో చేసిన ‘ఏజెంట్’ ఘోరంగా విఫలమయ్యాక సురేందర్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్‌తో ఒక మూవీ, చిరంజీవితో మరో సినిమా అనే ప్రచారం జోరుగా నడిచినా, ఏ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేదు.
దీంతో దర్శకుడు కొంత గ్యాప్ తీసుకుని తన తదుపరి సినిమా కోసం కొత్తగా ప్లాన్లు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూడో సినిమా రాబోతుందన్న సమాచారం హల్చల్ చేస్తోంది. ఇది కూడా ‘కిక్’ ఫ్రాంఛైజీ కొనసాగింపుగానే ఉండొచ్చని టాక్. సురేందర్ రెడ్డి ఇటీవల రవితేజను కలిసి కథ చెప్పగా, వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ ముందుకు సాగుతున్న రవితేజ ఈ కథకి వెంటనే ఓకే చెప్పేశాడని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. దీంతో త్వరలోనే ఈ కాంబినేషన్లో ‘కిక్ 3’ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ‘కిక్ 2’ను నిర్మించిన నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ పెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. రవితేజ మార్కెట్, అలాగే ‘ఏజెంట్’ తర్వాత సురేందర్ రెడ్డి మార్కెట్ కూడా పడిపోయిన పరిస్థితుల్లో ఈ కాంబోపై ఉన్న క్రేజ్ ఈ ఫ్రాంఛైజీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.
ప్రస్తుతం రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాడు. ఈ రెండు సినిమాలు 2026లోనే రిలీజ్ కానుండటంతో, ఆ తర్వాతనే రవితేజ–సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ‘కిక్ 3’ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ‘ఏజెంట్’ ఫలితంతో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న సురేందర్ రెడ్డి ఈసారి స్క్రిప్ట్ విషయంలో అత్యంత జాగ్రత్తగా పని చేసినట్టు తెలుస్తుంది. అభిమానులు మాత్రం ‘కిక్’ స్థాయి ఎనర్జీని తిరిగి చూడబోతున్నామా అనే ఉత్సుకతతో ఉన్నారు.