‘భలేమంచి చౌక బేరము..’ పాట వినని తెలుగువారు ఉండరు. మనందరికీ 1966లో ఎన్టీఆర్ నటించిన ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమాలోనిది అని మాత్రమే తెలుసు ఈ గీతం. అంతకుముందు 31 ఏండ్ల కిందటే ఓ కృష్ణతులాభారం వచ్చింది. అంటే 1935లో పుట్టిన ఆ పాట.. ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. దశాబ్దాలు దాటినా జనం నోళ్లలో నేటికీ వినిపిస్తున్న ఆ గీత రచయిత మరెవరో కాదు.. మన తెలంగాణ ముద్దుబిడ్డ చందాల కేశవదాసు. కాలం మర్చిపోయినా, కాలమిస్టులు విస్మరించినా తెలుగు సినిమా తొలి సినీ కవి చందాల కేశవదాసు. నేడు ఆయన 69వ వర్ధంతి సందర్భంగా మన తెలంగాణ తేజాన్ని స్మరించుకుందాం..
మూకీ సినిమాల మనుగడ పోయి టాకీ సినిమాల ప్రస్థానం మొదలైన సంవత్సరం 1932. ఆ సినిమాకు దర్శకుడు హెచ్ఎం రెడ్డి. ఇప్పటికీ అందరికీ గుర్తున్నాడు. అందులో నటించిన నటీనటులూ సుపరిచితులు అయ్యారు. ఆ సినిమాకు పాటలు అందించిన చందాల కేశవదాసు మాత్రం ఎందుకో తెరమరుగయ్యారు. ఆయన కళా విన్యాసాలు పరిశోధకుల దగ్గరే ఆగిపోయాయి. తొలి తెలుగు సినీకవిగా అనంత కీర్తి మూటగట్టుకోవాల్సిన కేశవదాసును ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే స్మరించుకునే పరిస్థితి ఏర్పడింది.
చందాల కేశవదాసు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన హరికథా పితామహుడు. సాహితీవేత్త, అష్టావధాని, శతావధాని. రంగస్థల నటుడు. పద్యనాటకాలకు విశేష ఆదరణ ఉన్న కాలంలో లెక్కకు మిక్కిలి ప్రదర్శనలకు నోచుకున్న ‘కనకతార’ నాటకకర్త. ఇలా అనేక రంగాల్లో తనదైన ముద్రవేసిన చందాల కేశవదాసు ఖమ్మం జిల్లా జక్కేపల్లిలో 1876 జూన్ 20న జన్మించారు. వీధిబడిలో చదివి, అదే బడిలో ఉపాధ్యాయుడిగానూ పనిచేశారు. ఎందరికో విద్యాదానం చేశారు. ఆ రోజుల్లోనే కుల వివక్షను ఎదిరించి హరిజనులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. హరికథా పోషకుడిగా నాలుగు దశాబ్దాల పాటు తెలుగునాట వందల సంఖ్యలో భాగవత సప్తాహాలు నిర్వహించారు.
కేశవదాసు తాత శ్రీనివాస్ ఆయుర్వేద వైద్యుడిగా భద్రాచలం దగ్గర్లోని గంగదేవిపాడులో ఉండేవారు. కేశవదాసు తండ్రి లక్ష్మీనారాయణ కూడా అదే వైద్యం నేర్చుకొని బతుకుదెరువు కోసం కూసుమంచి మండలం జక్కేపల్లికి మకాం మార్చారు. చందాల లక్ష్మీనారాయణ-పాపమ్మ దంపతుల రెండో కుమారుడు కేశవదాసు. నాలుగు దశాబ్దాలకుపైగా అక్కడే జీవనం సాగించారు. వీరి అన్న వెంకటరామయ్య ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ బ్రహ్మచర్య జీవనంతో యోగమార్గంలోకి వెళ్లి వీధిబడి నడిపాడు. అదే బడిలో చదువుకున్న కేశవదాసు.. క్రమంగా అష్టావధాని అయ్యారు. నాడు స్వాతంత్య్రోద్యమం సహా ఇతర పోరాటాల్లో ప్రజలను చైతన్యవంతులను చేసినవి వీధి నాటకాలు, హరికథలే. వాటిలో కేశవదాసు పాత్ర ఎనలేనిది. తన సాహిత్యంతో నేటి తరాలకు ఆదర్శంగా నిలిచారు. ఉన్న ఆస్తిపాస్తులు, బంగారు ఆభరణాలను కూడా ఆలయాలకు, ఆపదలో ఉన్నవారికి దానం చేసి ఔదార్యాన్ని చాటుకున్న ఉదాత్తుడు కేశవదాసు.
రంగస్థలంపై కేశవదాసు ముద్ర చెరగనిది. నేటికీ రంగస్థల నటులు నాటకం ప్రారంభానికి ముందు ఆలపించే ‘పరబ్రహ్మ పరమేశ్వర..’ ప్రార్థనా గీతం ఆయన రాసిందే. జాతీయవాదిగా ఎన్నో దేశభక్తి గీతాలు రాశారు. అవి గ్రామ్‌ఫోన్ రికార్డులుగా కూడా వెలువడటం విశేషం. కోల్‌కతాలో చాలా రోజులు సినిమాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 1930లో ‘జయతు జై’ అంటూ ప్రబోధ గీతాన్ని రాశారు. 1931లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు మొదలుపెట్టిన ‘భక్తప్రహ్లాద’లో సినిమాలో కీలక భూమిక పోషించారు. శ్రీకృష్ణతులాభారం (1935), సతీ అనసూయ (1935), లంకాదహనం (1936), కనకతార (1937) ఇలా తొలితరం తెలుగు చిత్రాలకు పాటలు, కొన్ని సినిమాలకు మాటలు కూడా అందించారు. అయితే, అప్పటి సమాజంలో సినిమాలకు అంతగా ఆదరణ లేకపోవడంతో.. ఆ రంగానికి దూరమయ్యారు. కోల్‌కతా నుంచి జక్కేపల్లికి వచ్చి అక్కడే ఉండిపోయారు.
తెలంగాణలో 1947 నాటికి నిజాం వ్యతిరేక ఉద్యమం ఉధృతమైంది. రజాకార్లు ప్రజలపై దాడులకు పాల్పడేవారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్న వారిపై భౌతికదాడులకు దిగేవారు. ఈ క్రమంలో కేశవదాసు ఇంటిపై కూడా దాడి చేశారు. ఈ సంఘటనలో ఆయన ఆస్తి ధ్వంసం కావడంతోపాటు విలువైన రచనలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన కేశవదాసు.. జక్కేపల్లి నుంచి ఖమ్మానికి మకాం మార్చారు. ఆయన కుమారుడు కృష్ణమూర్తి నాయకన్‌గూడెంలో ఆయుర్వేద వైద్యం చేసేవాడు. చివరి రోజుల్లో కొడుకు దగ్గరే ఉన్న కేశవదాసు 1956 మే 14న కన్నుమూశారు. కేశవదాసుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సాహితీ ప్రజ్ఞకు, ఆధ్యాత్మిక జిజ్ఞాసకు మారుపేరుగా నిలిచిన కేశవదాసు ఎప్పటికీ చిరంజీవే! కాలం విస్మరించినా.. చరిత్ర మాత్రం ఈ చిరస్మరణీయుణ్ని సదా కీర్తిస్తూనే ఉంటుంది.
…? దేవులపల్లి వెంకటరమణ, కూసుమంచి