ధృవ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘కిరోసిన్’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్‌పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. మిస్టరీ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 17న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘క్రైమ్ థ్రిల్లర్ కథతో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తున్నది. హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ధృవ పనితనం ట్రైలర్లో కనిపిస్తున్నది. ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించాలని కోరుకుంటున్నా’ అన్నారు. నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడుతూ..‘ఈ కథ విన్నప్పుడు తప్పకుండా సినిమాగా నిర్మించాలని అనుకున్నాం. మేము ఆశించిన రీతిలో సినిమా ఔట్ పుట్ వచ్చింది. మిస్టరీ మూవీ అయినా మిగతా వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు సమ్మెట గాంధీ, మీసాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.