Lakshmi R Menon | మలయాళ నటి లక్ష్మీ ఆర్ మీనన్‌కు కేరళ హైకోర్టు ఊరటనిచ్చింది. కిడ్నాప్, దాడికి సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో లక్ష్మీ మీనన్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బెచు కురియన్ థామస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 24న కొచ్చిలోని ఓ పబ్ వద్ద జరిగిన ఘటనలో నటితో పాటు ఇద్దరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
పబ్ వద్ద లక్ష్మీ మీనన్ గ్యాంగ్, ఐటీ ప్రొఫెషనల్ మధ్య వివాదం జరిగింది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. నటి లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు బాధితుడిని వెంబడించి, ఐటీ ఉద్యోగి కారును అడ్డగించారు. ఆ తర్వాత సదరు వ్యక్తిని బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకొని వెళ్లి అతనిపై పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ (BNS), 2023 లోని కిడ్నాప్-అపహరణ, బెదిరింపులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో నటి లక్ష్మీ మీనన్ పేరును సైతం చేర్చారు. వివాదాన్ని సామరస్య పూరక్వంగా పరిష్కరించామని.. ఈ కేసును మరింత ముందుకు తీసుకువెళ్లకూడదని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు నిందితులకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించింది.
కేసు విచారణ సందర్భంగా ఎఫ్ఐఆర్లోని ప్రాథమిక ఆరోపణలు తీవ్రమైన నేరం జరిగినట్లుగా చూపిస్తుందని కోర్టు పేర్కొంది. అయితే, ఈ సమస్య పరిష్కారమైందని, పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంటూ డీ-ఫాక్టో ఫిర్యాదుదారుడు అఫిడవిట్ దాఖలు చేశారని పేర్కొంది. ముందస్తు బెయిల్ పిటిషన్లో తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమని.. కేవలం ప్రేరేపితమని, కేసులో తన ప్రమేయం ఏమీ లేదంటూ ఖండించారు. దర్యాప్తు కొనసాగే వరకు మీనన్, ఇతర నిందితులు అరెస్టు నుంచి హైకోర్టు మినహాయింపును ఇచ్చింది. దాంతో నటికి ఈ కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగింది.