L 2 Empuraan | స్టార్ నటుడు మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఎల్ 2 ఎంపురాన్’ చిత్రం వివాదంలో చిక్కుకున్నది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఈ మూవీని హిందూ వ్యతిరేక చిత్రంగా అభివర్ణించింది. కాంగ్రెస్ ఈ చిత్రానికి మద్దతు ప్రకటించగా.. బీజేపీ మాత్రం మిన్నకుండిపోయింది. ఎంపురాన్ చిత్రం ఈ నెల 27న విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి స్పందన వస్తున్నది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఎల్ 2 ఎంపురాన్పై ఆర్ఎస్ఎస్ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ ఆర్గనైజర్‌లో ప్రచురించిన కథనం ప్రకారం.. ఈ చిత్రం 2002 గోద్రా అల్లర్ల నేపథ్యాన్ని ఉపయోగించి హిందూ వ్యతిరేక రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకువస్తుందని ఆరోపించింది. ఈ మూవీ స్టోరీ హిందువులను కించపరచడమే కాకుండా.. ప్రత్యేకంగా హిందూ అనుకూల రాజకీయ భావజాలాలను లక్ష్యంగా చేసుకుంటుందని విమర్శించింది. ఈ సినిమా హిందూ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక కథనాన్ని వ్యాప్తి చేయడానికి ఒక మాధ్యమమని.. వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారంటూ మండిపడింది.
భారతదేశంతో సహా ఉపఖండంలో జరుగుతున్న మారణహోమం మధ్య హిందువులను విలన్లుగా చిత్రీకరించే హిందూ వ్యతిరేక ప్రచార చిత్రం ఎంపురాన్ అంటూ మండిపడింది. బీజేపీ కేరళ ప్రధాన కార్యదర్శి పీ సుధీర్ మాట్లాడుతూ ఈ మూవీ తన దారిలో వెళ్తుందని.. పార్టీ సైతం తన పని తాను చేసుకుంటుందన్నారు. ఈ సినిమాతోనూ పార్టీ ప్రభావితం కాదని.. సంఘ్‌కు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచే హక్కు ఉందని.. అది మంచి చిత్రమా? లేదా? అన్నది నిర్ణయించుకునే హక్కు ప్రేక్షకులకు ఉందని పేర్కొంది. కేరళ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కుట్టతిల్ మూవీకి మద్దతు ప్రకటించారు. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి నిరాధారమైన అబద్ధాలు, మతపరమైన ద్వేషాలతో కూడిన చిత్రాలకు భావ ప్రకటనా స్వేచ్ఛను సమర్థించే వ్యక్తులు ఇప్పుడు ఎంపురాన్‌ను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. మూవీని నిర్మించిన నిర్మాత పురస్కారానికి అర్హుడని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి దివంగత కొడియేరి బాలకృష్ణన్ కుమారుడు, నటుడు బినీష్ కొడియేరి పేర్కొన్నారు.