‘మహానటి’ తరువాత కీర్తిసురేష్ తన పంథాను మార్చుకుంది. ఎక్కువగా యువ కథానాయకులతో జత కట్టడానికే ఈ భామ మొగ్గుచూపుతున్నది. ఇటీవల నానితో కలిసి ‘దసరా’లో నటించి అందరి ప్రశంసలు అందుకున్న కీర్తిసురేష్ త్వరలో నాగచైతన్య సరసన ఓ చిత్రంలో నటించబోతుందని తెలిసింది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా సినిమాలో ఈ అందాలతార కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం.
గతంలో నాగచైతన్య, చందు మొండేటి కలయికలో ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. ఈ తాజా చిత్రాన్ని జీఏ టూ పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్, బన్నీవాస్లు నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేస్తారు.