Keerthy Suresh | ‘తెలంగాణ యాస ఎలా వచ్చింది? ఇక్కడి భాష నేర్చుకోడానికి కష్టపడ్డావా?’ అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘నేనేం గుజరాత్ నుంచి రాలేదు! తమిళనాడే కదా? ఈజీగానే వచ్చేసింది’ అంటూ కటాకట్ సమాధానం చెప్పింది ‘దసరా’ హీరోయిన్ కీర్తి సురేశ్. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కుర్చీ వేసుకుని కూర్చున్న కీర్తి.. ఇప్పుడు వెన్నెల పాత్రలో మరోసారి అందరి మనసులూ గెలుచుకుంది. ఆ చందమామ చెప్పిన ముచ్చట్లు..
నాన్న సురేశ్ కుమార్ నిర్మాత, అమ్మ మేనక నటి. అక్క రేవతి వీఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్. దీంతో సినిమా ప్రయాణం చిన్నప్పటి నుంచే మొదలైంది. బాలనటిగా ఎంట్రీ ఇచ్చా. ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఆసక్తి ఉండేది. ఆ కోర్సు తర్వాత సినిమాల్లోకి వచ్చాను. మలయాళంలో గీతాంజలి నా తొలి సినిమా. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాలు చేశాను. సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. ఫ్యాషన్ డిజైనింగ్‌లో స్థిరపడే దాన్నేమో!
ప్రతి మనిషికి ఒక స్వభావం అంటూ ఉంటుంది. ఎవరైనా తమకంటే ఒక మెట్టు పైన ఉంటే.. కాళ్లు పట్టుకొని కిందికి లాగాలని చూస్తారు. లేదంటే బురద చల్లడమే పనిగా పెట్టుకుంటారు. సినిమా సెలెబ్రిటీల విషయంలో ఇది కాస్త ఎక్కువే. దీనికితోడు సోషల్ మీడియాలో సెలెబ్రిటీల గురించి ఏది పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంది. నా మీద కూడా చాలా కామెంట్స్, రూమర్స్ వచ్చాయి. వాటిని నేను అస్సలు పట్టించుకోను.
Keerthy Suresh1
నాకు ఈత అంటే ఇష్టం. చిన్నప్పుడు ఇంట్లోవాళ్లకు చెప్పకుండానే స్విమ్మింగ్‌కు వెళ్లిపోయేదాన్ని. జంతువులు, పక్షులన్నా మక్కువే. మా ఇంట్లో బుజ్జిబుజ్జి కుక్కపిల్లలు, మేకపిల్లలు, చిలుకలు, రకరకాల పక్షులు చాలా ఉన్నాయి. జంతు హింసకు వ్యతిరేకంగా పనిచేసే పెటా లాంటి సంస్థలకు నా మద్దతు ఉంటుంది.
‘దసరా’ మూవీలో వెన్నెలగా నన్ను ప్రేక్షకులు ఆదరిస్తారని ముందే ఊహించాను. మహానటి తర్వాత నాకు వచ్చిన ఛాలెంజింగ్ రోల్ ఇదే. అందుకే వెంటనే ఒప్పేసుకున్నా. పాత్రకు తగినట్టు తెలంగాణ యాస బాగా ప్రాక్టీస్ చేశాను. షూటింగ్ టైమ్‌లో ఒక ప్రొఫెసర్, ఓ అసిస్టెంట్ డైరెక్టర్ నాకు హెల్ప్ చేశారు. డబ్బింగ్ సమయానికి అవగాహన వచ్చేసింది.
పొద్దున లేవగానే ఒక గ్లాసు పాలలో తేనె కలుపుకొని తాగేస్తా. ఆ తర్వాత రోజంతా నీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకుంటా. నాన్‌వెజ్ అంటే ఇష్టం. కాకపోతే గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి ఎక్కువగా వెజ్ డైట్ ఫాలో అవుతుంటా. భోజనంలో చారు ఉండాల్సిందే. చివరి ముద్ద చారన్నం తింటేనే భోజనం పూర్తయినట్టు. రోజూ వర్కవుట్స్, యోగా చేస్తా. ఇవే నా గ్లామర్ సీక్రెట్స్. ఇంతకుమించి పెద్దగా జాగ్రత్తలు తీసుకోను. జస్ట్ ఐస్‌క్యూబ్స్‌తో ముఖానికి మర్దన చేస్తాను. షూటింగ్ కోసం తప్పితే.. మేకప్, టచప్ జోలికే వెళ్లను. అందుకేనేమో.. చిన్ని, దసరా సినిమాల్లో డీగ్లామర్ పాత్రలు చేయడానికి కూడా పెద్దగా ఆలోచించలేదు.