ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఇంట విషాదం నెలకొన్నది. ఆయన తండ్రిగారైన ప్రముఖ రచయిత, చిత్రకారుడు శివశక్తి దత్తా(92) హైదరాబాద్‌లోని తన నివాసంలో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం. కీరవాణి పెద్ద కుమారుడు కాగా, మరో సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ రెండవ కుమారుడు. నటుడు, రచయిత శివశ్రీ కంచి మూడో కుమారుడు. శివశక్తి దత్తా తమ్ముడైన విజయేంద్రప్రసాద్ ప్రముఖ సినీ కథారచయితగా చిత్రపరిశ్రమలో వెలుగొందుతున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, గాయని, సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖకు శివశక్తి దత్తా స్వయానా పెదనాన్న. శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబర్ 8న రాజమండ్రి సమీపంలోని కొవ్వూరులో జన్మించిన శివశక్తి దత్తాకు చిన్నతనం నుంచి కళలపై మక్కువ ఎక్కువ. అందుకే ఇంట్లో చెప్పకుండా ముంబయి వెళ్లిపోయి ఓ ఆర్ట్స్ కాలేజీలో చేరారు.
రెండేళ్ల తర్వాత కొవ్వూరుకి తిరిగొచ్చి ‘కమలేశ్’ అనే కలం పేరుతో చిత్రకారుడిగా పనిచేశారు. సంగీతంపై మమకారంతో గిటార్, సితార్, హార్మోనియం కూడా నేర్చుకున్నారు. కీరవాణికి సంగీతంపై ఇష్టం పెరగడానికి కారణం శివశక్తి దత్తానే అంటారు. 1988లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివశక్తిదత్తా.. ‘జానకిరాముడు’ సినిమాకు స్క్రీన్‌రైటర్‌గా పనిచేశారు. ‘బాహుబలి1’లో (మమతల తల్లి, ధీవర..) , ‘బాహుబలి 2’లో (సాహోరే బాహుబలి..) ఎన్టీఆర్ ‘కథానాయకుడు’లో (ఘన కీర్తిసాంద్ర) ‘ఆర్ఆర్ఆర్’లో (రామం రాఘవమ్..), ‘హను-మాన్’లో (అంజనాద్రి థీమ్ సాంగ్), ‘సై’లో (నల్లా నల్లాని కళ్ల పిల్లా..), ‘ఛత్రపతి’లో (మన్నేల తింటివిరా), ‘రాజన్న’లో (అమ్మా.. అవని).. ఈ పాటలన్నీ శివశక్తిదత్తా రాసినవే. ఆయన మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.