Keeda-Cola Teaser | పది రోజులుగా ‘కీడా కోలా’ అంటూ తరుణ్ భాస్కర్ తన కొత్త సినిమాను వినూత్నంగా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ప్రతీరోజు ఈ సినిమాలోని ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ మంచి బజ్ తీసుకొచ్చాడు. ఇక తరుణ్ ‘ఈ నగరానికి ఏమైంది’ తర్వాత దాదాపు ఐదేళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై వీర లెవల్లో హైప్ ఏర్పడింది. ఓ బొద్దింకను, కోలా క్యాప్‌ను చూపించి కీడా కోలా అంటూ వినూత్న టైటిల్ పెట్టి మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాడు. పైగా బ్రహ్మనందంను కీలకపాత్రలో పెట్టి సినిమా తీయడంతో అందరిలోనూ తెలియని ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది.
టీజర్లో పెద్దగా ఏమి రివీల్ చేయలేదు కానీ.. తరుణ్ తన టైప్ ఆఫ్ క్రింజే కామెడీతోనే సినిమా తెరకెక్కించినట్లు స్పష్టం అయింది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది తరహాలోనే నేచురల్ కామెడీతో అలరించనున్నాడు. కోలా బాటిల్ ను బ్రహ్మీ, చైతన్య రావు అనుమానాస్పదంగా చూస్తున్న సీన్‌తో టీజర్ మొదలైంది. ఆ తరువాత ఆ కోలాను ప్రధానంగా చూపిస్తూ గన్నులు, ఫైరింగ్, యాక్షన్‌ను నడిపించాడు. చివర్లో కోలా లోంచి బొద్దింక పైకి ఎక్కడానికి తెగ ట్రై చేస్తున్నట్లు చూపించాడు. మొత్తంగా టీజర్ చూస్తుంటే కాస్త డిఫరెంట్‌గానే ఉంది. టీజర్ మొత్తంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది.
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి బంపర్ హిట్ల తర్వాత తరుణ్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో కీడా కోలాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సారి కూడా కథనే హీరోగా పెట్టి సినిమా తెరకెక్కించినట్లు స్పష్టం అయింది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తరుణ్ దర్శకత్వం వహించడమే కాకుండా ఓ కీలక పాత్ర కూడా చేస్తున్నాడు. వీజీ సైన్మా సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.