Tharun Bhasckar | గెలవడం గొప్ప.. గెలుస్తూ పదుగురిని గెలిపించడం ఇంకా గొప్ప. వ్యక్తి పరిశ్రమగా మారినప్పుడే ఇలాంటివి జరుగుతుంటాయి. అందుకు ఉదాహరణే తరుణ్‌భాస్కర్. తాను గెలుస్తుంటాడు. ఆ గెలుపులోంచి చాలామంది పుట్టుకొస్తుంటారు. అలా వచ్చినవాళ్లలో హీరోలున్నారు. దర్శకులున్నారు. కమెడియన్స్ కూడా ఉన్నారు. శుక్రవారం రాబోతున్న ‘కీడాకోలా’ సినిమాతో ఇంకొంతమంది వస్తారు. మొత్తంగా తరుణ్‌భాస్కర్ అంటే సినిమావాళ్లను తయారు చేసే కర్మాగారం. ఆ కర్మాగారంతో సరదాగా ముచ్చటించడం జరిగింది. ఆ వివరాలివి.
రోడ్‌పై ఉండే మ్యాన్ హోల్ కవర్ తీసుకెళ్లి ఇనుప సామాన్లవాళ్లకు అమ్మేస్తున్నారు. ఈజీగా డబ్బులొచ్చేస్తాయి కదా. అలాగే తినే పదార్థాల్లో పురుగు కనిపించిందనుకోండి దానిపై లీగల్‌గా ప్రొసీడై డబ్బు సంపాదించుకోవచ్చు. ఈజీగా డబ్బు సంపాదించడంలో ఇది కూడా ఓ విధానం. దగ్గరగా చూస్తే క్రైమ్‌గా కనిపించే ఇవే.. దూరంగా చూస్తే కామెడీగా అనిపిస్తాయి. ‘ఇదేదో బావుందికదా.. దీన్ని చూపిస్తే పోలా’ అనే చిన్న చిలిపి ఆలోచన. ఫ్రెండ్స్‌తో చర్చించి నిర్ణయం తీసుకున్నా. పైగా నాకు ఇష్టమైన జానర్ క్రైమ్ కామెడీ. అందుకే ఇష్టంతో కథ తయారు చేసుకున్నాను. ఇష్టమైన జానర్లో సినిమా తీయాలనే నా కల ‘కీడాకోలా’తో నెరవేరింది..
‘పెళ్లి చూపులు’ చిత్రానికి మాటల రచయితగా జాతీయ అవార్డు వచ్చింది. బరువుగా అనిపించింది. అర్జంట్‌గా ఫ్లాప్ ఇచ్చి ఆ బరువును దించేసుకోవాలని ‘ఈ నగరానికి ఏమైంది’ చేశా. అది కూడా హిట్ అయింది. బరువు ఇంకా పెరిగిపోయింది. నిజానికి ఈ రెండు సినిమాల విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. కానీ ‘కీడాకోలా’ విషయంలో అస్సలు టెన్షన్లేదు. రెండుమూడుసార్లు చూసుకున్నా. హిట్ పక్కా. ఇందులో బ్రహ్మానందం, రఘుగారు తప్ప మిగిలిన అందర్నీ ఆడిషన్స్ చేసే తీసుకున్నాం. బ్రహ్మానందంగారి పాత్రకు ప్రేరణ మా తాతయ్యే. ఆయన పాత్రలో మా తాత పోకడలు చాలా కనిపిస్తాయి.
ఇందులో ప్రతి పాత్రలో ఎంతోకొంత నాకు నేను కనిపిస్తాను. ముఖ్యంగా నాకోసం రాసుకున్న ‘నాయుడు’ పాత్ర చేస్తున్నప్పుడు నాలో ఉండే భారం సగం తగ్గిపోయినట్లు అనిపించింది. నా జీవితంలో నేను చూసిన ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఇందులో ఉంటాయి. ఒక కథ రాస్తున్నప్పుడు ప్రతి పాత్రలోకి వెళ్లి ఆలోచించడం రచయితకు చాలా అవసరం. ఈ కథ విషయంలో ఓ మథనమే జరిగింది. ఇందులో మొత్తం ఎనిమిది పాత్రలున్నాయి. అందులో హీరో ఎవరు? నేను, నా రైటింగ్ టీమ్ బెట్ వేసుకున్నాం. మరి ఆడియన్స్ ఎవర్ని హీరో అంటారో చూడాలి.
పైప్‌లైన్‌లో కొన్ని కథలున్నాయి. అలాగే వెంకటేశ్‌గారి సినిమా విషయంలోనూ త్వరలో ఓ క్లారిటీ ఇస్తాను. ఈ సినిమా ఫస్టాఫ్ రెడీగా ఉంది. సెకండాఫ్ విషయంలో సంతృప్తిగా లేను. సురేష్‌గారు షూటింగ్‌కు వెళ్లిపో అంటున్నారు. కానీ రచయితగా నేను సంతృప్తి చెందకుండా లొకేషన్‌కి వెళ్లలేను. త్వరలోనే సెకండాఫ్ విషయంలోనూ ఓ క్లారిటీ వస్తుంది. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నా.