సినిమా పరిశ్రమ అంటేనే ఓ పరమపద సోపానపటం. ఎప్పుడు ఎవరు నిచ్చెనలు ఎక్కేస్తారో.. ఎవరు కాలసర్పాలతో కరవబడతారో చెప్పలేం. ప్రస్తుతం హీరోయిన్ కయదు లోహర్ నిచ్చెనలమీద నిచ్చెనలు ఎక్కేస్తున్నది. ఈ అందాలభామ తొలిసినిమాకు తీసుకున్న పారితోషికం 20 లక్షలని టాక్. ‘డ్రాగన్’ పుణ్యమా అని ఏకంగా ఇప్పుడు రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నదని కోలీవుడ్ టాక్. ఒక్క సినిమాతో ఫేట్ మారిపోవడమంటే ఇదే.
ప్రసుతం తెలుగులో విశ్వక్సేన్ ‘ఫంకీ’ సినిమాలో కథానాయికగా నటిస్తున్న కయదు.. తమిళంలో ‘శింబు’తో ఓ సినిమా చేయబోతున్నది. మరో నాలుగైదు ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయట. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడి ఫాలోవర్స్ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.
ఇటీవల ఓ చిట్ చాట్లో ఈ అందాలభామ మాట్లాడుతూ ‘హీరోయిన్ కావడం మాత్రమే కాదు, నటిగా చాలా సాధించాలి. ఎన్నో ఆశలతో ఈ రంగంలోకి వచ్చాను. డబ్బు ముఖ్యం కాదు. పదికాలాల పాటు నటిగా నా గురించి చెప్పుకోవాలి.’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న స్పీడ్ చూస్తుంటే.. కయదు కల నిజమయ్యేలానే ఉంది.