Katrina – Vicky |బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. నవంబర్ 7న తమ మొదటి సంతానాన్ని ప్రపంచంలోకి స్వాగతించిన ఈ జంట, ఇప్పుడు మరోసారి అభిమానులకు సంతోషకరమైన అప్డేట్ ఇచ్చారు. నిన్నటితో వారి కుమారుడికి రెండు నెలలు పూర్తవడంతో, సోషల్ మీడియా వేదికగా అతన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ముఖం మాత్రం చూపించకుండా, బాబు పేరును అధికారికంగా వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్ 2025లోనే కత్రినా ప్రెగ్నెన్సీని విక్కీ, కత్రినా అభిమానులతో పంచుకున్నారు. ఆ సమయంలో ఒక అందమైన పోలరాయిడ్ ఫోటోను షేర్ చేస్తూ, తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని చెప్పారు. అప్పటి నుంచి బిడ్డ రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు.
ఇప్పుడా నిరీక్షణకు ముగింపు పలుకుతూ, తమ కొడుకుకు ‘విహాన్ కౌశల్’ అనే ప్రత్యేకమైన పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంగా పోస్ట్ చేశారు. “మా వెలుగు కిరణం విహాన్ కౌశల్. ప్రార్థనలు ఫలించాయి. జీవితం ఎంతో అందమైనది. మా ప్రపంచం ఒక్క క్షణంలోనే పూర్తిగా మారిపోయింది” అని రాసుకొచ్చారు. ఈ మాటలు అభిమానుల మనసులను తాకాయి.పోస్ట్‌లో విక్కీ, కత్రినా తమ కొడుకు ముఖాన్ని బయటపెట్టలేదు. అయితే ఒక అందమైన ఫ్యామిలీ ఫోటోను మాత్రం షేర్ చేశారు. ఆ ఫోటోలో విక్కీ, కత్రినా చేతుల మధ్య చిన్నారి విహాన్ చేయి కనిపిస్తోంది. ఈ సింపుల్ కానీ ఎమోషనల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విహాన్ అనే పేరు విక్కీ అభిమానులకు ఇప్పటికే పరిచయమే. 2019లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ లో విక్కీ కౌశల్ పోషించిన పాత్ర పేరు మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ, పలువురు నెటిజన్లు కామెంట్స్ సెక్షన్లో స్పందించారు. “ఉరిలో విక్కీ పాత్ర పేరు కూడా విహానే” అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి, విక్కీ–కత్రినా తమ కుమారుడి పేరు ప్రకటించిన ఈ క్షణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ స్టేటస్‌కు అతీతంగా, ఒక సాధారణ తల్లిదండ్రుల్లా తమ ఆనందాన్ని పంచుకున్న ఈ జంటపై అభిమానులు ప్రేమను కురిపిస్తున్నారు.