Katrina Kaif | అందంతో పాటు అద్భుతాభినయంతో హిందీ చిత్రసీమలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అగ్ర కథానాయిక కత్రినా కైఫ్. ఇటీవలే ‘టైగర్-3’ చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చిందీ భామ. గురువారంతో ఈ అమ్మడు ఇరవై ఏండ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్మీడియాలో అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించింది. సుదీర్ఘ కెరీర్లో తన విజయాల పట్ల సంతృప్తిగా ఉన్నానని, కోరుకున్నది సాధించానని ఆనందం వ్యక్తం చేసింది.
ఆమె మాట్లాడుతూ ‘ఈ ప్రయాణం ఓ కలలా గడచిపోయింది. ప్రతీ చిత్రానికి నటనలో పరిణతి సాధించాను. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మొదలుకొని యాక్షన్ జోనర్ సినిమాల్లో నటించాను. ఈ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. ఇండస్ట్రీలో పోటీ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. నాకు నేనే పోటీగా భావించా. పాత్రలపరంగా కొత్తగా కనిపించేందుకు ప్రయత్నించా. భవిష్యత్తులో మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా’ అని పేర్కొంది.