Katrina Kaif | పర్యాటకులకి మాల్దీవ్స్ ఎంతటి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీలి రంగు సముద్రం చూస్తుంటేనే మనసు పులకరించిపోతుంది. అయితే మాల్దీవ్స్ జీవితంలో ఒక్కసారైన చూడాలని చాలా మందికి కల ఉంటుంది. ఆ కలని కొందరు సాకారం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మాల్దీవులకి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్ ఎంపికయింది. మాల్దీవులను ప్రముఖ పర్యాటక గమ్యంగా పరిచయం చేయడంలో భాగంగా కత్రినాని అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్టు మాల్దీవుల టూరిజం ప్రమోషన్ సంస్థ అయిన మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ (MMPRC) తాజాగా ప్రకటించింది.
కత్రినా కైఫ్ రాయబారిగా ఎంపిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ.. మాల్దీవులు అనేవి సహజసిద్ధమైన అందం, ఎంతో ప్రశాంతంగా ఉండే ప్రదేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులని పెంచేందుకు, వారికి అత్యుత్తమ అనుభవాలను అందించేందుకు నా వంతు కృషి చేస్తానని కత్రినా స్పష్టం చేశారు. మరోవైపు, మాల్దీవ్స్ రాజకీయంగా కూడా భారత్ సంబంధాలు మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముఇజ్జు ఇచ్చిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన , భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై నెలలో మాల్దీవులకు వెళ్లే అవకాశముందంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది.
ఇదే నిజమైతే ముఇజ్జు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ మొదటి పర్యటన అవుతుంది. కత్రినా కైఫ్ గ్లోబల్ అంబాసడర్‌గా, మరోవైపు ప్రధాని మోదీ పర్యటన ..ఈ రెండు సంఘటనలూ మాల్దీవులను ఒక ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా బలోపేతం చేయడం ఖాయం అని నెటిజన్స్ అంటున్నారు. కాగా, ఆ మధ్య ప్రధాని మోదీపై మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు మరియం షియూనా, మాల్షా షరీఫ్, మజూమ్ మాజిద్.. చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత భారతీయులంతా మాల్దీవులను బహిష్కరించారు. ఈ క్రమంలో భారతీయులని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అందుకే కత్రినాని అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.