Katragadda | అతి కొద్ది సినిమాలు మాత్రమే నిర్మించి.. బాక్సాఫీసు బద్దలు కొట్టిన తెలుగు చలన చిత్ర నిర్మాత కాట్రగడ్డ మురారి… ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ డ్రాప్‌ఔట్ విద్యార్థిగా ఉన్నారు. అదీ కూడా వరంగల్ జిల్లా కేంద్రంలోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదవడం గమనార్హం. 1944 జూన్ 14వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని విజయవాడలో జన్మించారు. తొలుత వైద్య విద్యనభ్యసించాలనుకున్నా.. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో సినిమా రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటూ మద్రాస్ రైలెక్కారు కాట్రగడ్డ మురారి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. చలన చిత్ర నిర్మాతగా మారిన తర్వాత యువ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై పలు సినిమాలు నిర్మించారు. ఆయన సినిమాలన్నింటికీ కేవీ మహాదేవన్ సంగీత దర్శకత్వం వహించడం ఆసక్తికర పరిణామం.
ఆయన ‘నవ్విపోదురు గాక’ అనే టైటిల్‌తో తన సొంత బయోగ్రఫీ 2012 నవంబర్ 17న రిలీజ్ చేశారు. అంతేకాదు భావి తరాలకు తెలుగు చలన చిత్ర నిర్మాతల చరిత్ర తెలిపేందుకు 1931-2005 మధ్య కాలం నాటి చిత్ర నిర్మాతల వివరాలు తెలియజేస్తూ.. ‘తెలుగు చలనచిత్ర నిర్మాతల చరిత్ర (1931-2005) అనే పుస్తకం రాయడంలో కీలకంగా వ్యవహరించారు.
క్లాసికల్ సినిమాల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన కాట్రగడ్డ.. ప్రముఖ సినీ నటులు, దక్షిణ భారత చలన చిత్ర నిర్మాతలు, ప్రత్యేకించి తెలుగు చలన చిత్ర నిర్మాతలకు గౌరవం ఇచ్చేవారు. కానీ, 2013లో చెన్నైలో భారతీయ సినిమా శత వార్షికోత్సవాల కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమానికి నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తమిళనాడు సీఎం జయలలిత గౌరవ అతిధిగా హాజరయ్యారు. తెలుగు చలన చిత్ర ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడాన్ని తప్పుబట్టారు. వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, భువనచంద్ర వంటి వారికి కూడా ఆహ్వానాలు లేవన్నారు.