Vijay Arrest | కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ నిర్వహించిన ప్రచార సభ తీవ్ర విషాదానికి దారితీసింది. తమిళనాడు కరూర్ జిల్లాలోని వేలుసామిపురంలో జరిగిన ఈ సభలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుని 39మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉండడం ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది. మరో 50 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 20 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉంది. దీనితో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే విజయ్ రాష్ట్రవ్యాప్త ప్రచారం ప్రారంభించి కొన్ని రోజులే అవుతోంది. శనివారం నామక్కల్‌లో ప్రచారాన్ని ముగించుకుని సాయంత్రం కరూర్ చేరిన ఆయన రాత్రి 7:30 గంటలకు ప్రసంగం ప్రారంభించారు.
భారీగా తరలివచ్చిన అభిమానులు విజయ్ను చూడాలని ముందుకు దూసుకొచ్చారు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకొని, స్పృహ కోల్పోయి పలువురు నేలకూలారు. వెంటనే తొక్కిసలాట ఏర్పడి భారీ ప్రాణనష్టం జరిగింది. ఈ దుర్ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సీఎం స్టాలిన్ తక్షణమే చర్యలు చేపట్టి, ఆదివారం బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. ఘటనపై విచారణకు రిటైర్డ్ హైకోర్టు జడ్జి అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఓ చర్చ సాగుతోంది. ఈ ఘటనకు విజయ్ బాధ్యత వహించాల్సిందేనంటూ, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. గతంలో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ప్రమోషన్లో హైదరాబాద్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనను ఉదహరిస్తూ, అప్పట్లో ఒక్కరు చనిపోతేనే హీరోపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా 38 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో విజయ్‌పై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశమైంది. విజయ్ అభిమానులు మాత్రం ఈ ఆరోపణలను తిప్పి కొడుతున్నారు. తొక్కిసలాట తలెత్తగానే విజయ్ తన ప్రసంగాన్ని నిలిపి సహాయక చర్యలకు ముందుకొచ్చారని, బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. ఇలాంటి ఘటనను రాజకీయంగా వాడుకోవడం బాధాకరమని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి తమిళనాడు పోలీసులపైనే ఉంది. కేసు నమోదు చేస్తారా? అరెస్ట్వరకు వెళ్లతారా? లేక విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి.