Karuppu | కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయాల్లోకి వెళ్లేముందు ఆయన చివరి చిత్రంగా ‘కరుప్పు’ (Karuppu) సినిమాను చేయాల్సిందని.. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో, ఈ అవకాశం హీరో సూర్యను వరించిందని తెలిపాడు దర్శకుడు ఆర్జే బాలాజీ.
విజయ్ రాజకీయాల్లోకి వచ్చే ముందు ఎలాంటి సినిమా చేయాలనే దానిపై తాము రెండు మూడు సార్లు సమావేశమై చర్చించామని బాలాజీ చెప్పారు. అయితే విజయ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నా, ఆయన చెప్పిన కారణాలు సమంజసంగానే ఉన్నాయని, ఆయన నిర్ణయాన్ని తాను గౌరవించానని తెలిపారు. అంతేకాదు, కథా చర్చల సమయంలో విజయ్ అడిగిన సరైన ప్రశ్నలే స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరచడానికి సహాయపడ్డాయని, అందుకే సినిమా ప్రారంభ క్రెడిట్స్‌లో విజయ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపానని బాలాజీ పేర్కొన్నారు.
ఆ తర్వాత నిర్మాతల కోరిక మేరకు ఈ కథను సూర్యకు వినిపించగా, ఆయనకు బాగా నచ్చి కొన్ని మార్పులు సూచించారు. అలా సూర్య హీరోగా ‘కరుప్పు’ సినిమా పట్టాలెక్కింది. తమిళ గ్రామదేవుడు ‘కరుప్పసామి’.. అవినీతిపై పోరాడేందుకు ఒక లాయర్ అవతారంలోకి మారే ఫాంటసీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే 15, 2026న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సినిమా చూసిన తర్వాత ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా చిత్రబృందాన్ని ఫోన్ చేసి అభినందించడం విశేషం.