సూర్య, కార్తి బ్రదర్స్ తెలుగునాట తిరుగులేని క్రేజ్‌ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. తమిళ డబ్బింగ్ చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న ఈ సోదరులిద్దరూ ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్య ఇప్పటికే తెలుగు చిత్రంలో భాగమయ్యారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఇదే బ్యానర్లో కార్తి తెలుగు స్ట్రెయిట్ చిత్రాన్ని చేయబోతున్నారని సమాచారం.
గతంలో తెలుగులో ఆయన ‘ఊపిరి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కార్తి కొత్త చిత్రానికి ‘మ్యాడ్’ ఫ్రాంఛైజీ ఫేమ్ కల్యాణ్‌శంకర్ దర్శకత్వం వహిస్తారని తెలిసింది. యాక్షన్ కామెడీ కథాంశమిదని, ఈ సినిమాలో నటించేందుకు కార్తి ఇప్పటికే అంగీకారం తెలిపారని వార్తలొస్తున్నాయి. మరి వీటిలో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.