Yash | ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ స్టార్ హీరో యష్ చేస్తున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). యాశ్ 19గా తెరకెక్కనున్న ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీన్ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాణ సంస్థకు కర్ణాటక హైకోర్టు నోటిసులు ఇచ్చింది.
అటవీ భూమిలో అక్రమంగా సినిమా సెట్ వేశారు అనే ఆరోపణలపై కర్ణాటకకు చెందిన బాలాజీ నాయుడు అనే న్యాయవాది కర్ణాటక హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్లో నటుడు యష్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం టాక్సిక్ కోసం బెంగళూరు శివార్లలోని 20 ఎకరాల అటవీ భూమిలో అనుమతి లేకుండా సినిమా సెట్ వేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ ప్రాంతంను సినిమా కోసం అనుమతించిన హెచ్ఎంటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని షూటింగ్ నిలిపివేయాలని ఆయన పిటిషన్లో కోరారు.
ఇక ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ అంజరియా, జస్టిస్ కేవీ అరవింద్‌లతో కూడిన ధర్మాసనం కేవీఎన్ ఫిల్మ్ ప్రొడక్షన్‌కు నోటీసులు పంపి విచారణను ఆగస్టు 19కి వాయిదా వేశారు.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.
Also read..