Maneka Gandhi : లోక్‌సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి గెలుపును సవాల్ చేస్తూ బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి హైకోర్టుకు మేనకాగాంధీ (Maneka Gandhi) అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) లో పిటిషన్ వేశారు. ఎన్నికల్లో తనపై గెలిచిన సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి అన్నుల్ నిషాద్ (Annul Nishad) ఎన్నికల అఫిడవిట్లో వాస్తవాలు దాచాడని ఆమె తన పిటిషన్లో ఆరోపించారు. తనపై ఉన్న క్రిమినల్ కేసులను ఆయన దాచిపెట్టాడని పేర్కొన్నారు.
అన్నుల్ నిషాద్పై మొత్తం 12 క్రిమినల్ కేసులు ఉన్నాయని, కానీ తన నామినేషన్ పత్రాల్లో ఆయన తనపై 8 క్రిమినల్ కేసులు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారని తెలిపారు. వాస్తవాలు దాచిపెట్టి ఎన్నికల్లో గెలిచిన అన్నుల్ నిషాద్పై అనర్హత వేటువేసి.. తనను ఎంపీగా గెలిచినట్లు ప్రకటించాలని ఆమె కోర్టును కోరారు. మేనకాగాంధీ పిటిషన్ స్వీకరించిన లక్నో బెంచ్.. ఈ నెల 30న విచారణ చేపట్టనుంది.
కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మేకాగాంధీ తన సిట్టింగ్ స్థానమైన సుల్తాన్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. సమాజ్‌వాదీ పార్టీ ఆమెపై అన్నుల్ నిషాద్‌ను పోటీకి నిలిపింది. ఈ ఎన్నికల్లో అన్నుల్ నిషాద్ మేనకాగాంధీపై 43,174 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.