Karishma Tanna | కరిష్మా తన్నా.. నటి, మాడల్, యాంకర్. ‘స్కూప్’ వెబ్‌సిరీస్‌తో ఏక్దమ్ స్టార్డమ్ సాధించింది. అందులో జర్నలిస్టు జాగృతి పాఠక్ పాత్రకు అతికినట్టు సరిపోయింది. బ్రేకింగ్ న్యూస్ రాజకీయాలు, ప్రమోషన్ పందేరాలు, మగబాసుల ఆకలి చూపులు, సింగిల్ మదర్‌గా ఇంటి బాధ్యతలు, మాజీ భర్త అరాచకాలు.. అన్నిటినీ అధిగమిస్తూ వృత్తిలో దూసుకుపోయే పక్కా ప్రొఫెషనల్ జర్నలిస్ట్ పాత్రలో తను జీవించింది. కాబట్టే, గ్లామర్ ప్రపంచం కరిష్మా తన్నాను దేవకాంతలా చూస్తున్నది. అవకాశాలూ వెల్లువెత్తుతున్నాయి.
‘ప్రస్తుతానికి నేను ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నా’ అంటున్నది కరిష్మా. తను బంధాల మనిషి. ‘అమ్మానాన్నల తర్వాతే ఏవరైనా’ అని ధీమాగా ప్రకటిస్తున్నది. స్వతహాగా భోజన ప్రియురాలు కూడా. ‘నేను మనుషుల్ని ప్రేమిస్తాను. కానీ మన ముందు ఒకలా, వెనుక మరోలా మాట్లాడేవారంటేనే భయం. అలాంటి వాళ్లను సాధ్యమైనంత దూరం పెడతాను. ‘స్కూప్’ తర్వాత అంతా నన్నో పెద్ద స్టార్లా చూస్తున్నారు. అంతవరకూ ఫర్వాలేదు. ఎవరైనా నా వ్యక్తిగత జీవితంలోకి చొచ్చుకొస్తే మాత్రం కోపం వచ్చేస్తుంది’ అంటున్నదీ ముంబై భామ.