Anvesh Varala | అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో తెలంగాణ కుర్రాడి షార్ట్ ఫిలిం సత్తా చాటుతోంది. కరీంనగర్ పట్టణానికి చెందిన అన్వేష్ వారాల డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన అపార్ చిత్రం 28వ కలకత్తా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో అధికారికంగా ప్రదర్శించబడింది. ఇప్పటికే ఈ షార్ట్‌ఫిలిం పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది.
అన్వేష్ వారాల మొదట కేరళలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏవియానిక్స్ చదివాడు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో సత్యజీత్ రే ఫిలిం అండ్ టీవీ ఇన్స్టిట్యూట్లో పీజీ ఇన్ సినిమాటోగ్రఫీ పూర్తి చేశాడు. అక్కడి ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే అపార్ అనే లఘు చిత్రానికి డీఓపీ అందించాడు. ఈ షార్ట్ ఫిలిం గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని జాగరణ్ ఫిలిం ఫెస్టివల్‌కు అధికారిక ఎంట్రీకి ఎంపికైంది. దర్బంగా, బరేలీ, వారణాసి నగరాల్లో ప్రదర్శితమై విమర్శకులను సైతం మెప్పించింది. ఆ తర్వాత బెంగళూరులో నిర్వహించిన బెంగళూరు క్వీర్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. తాజాగా 28వ కలకత్తా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో కూడా అధికారికంగా ప్రదర్శించబడింది. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక కలకత్తా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు తమ అపార్ షార్ట్ ఫిలిం ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని అన్వేష్ తెలిపాడు.
15 నిమిషాల నిడివి గల అపార్ షార్ట్ ఫిలిం లెస్బియన్ల సమస్యలపై రూపొందింది. ఈ లఘు చిత్రంలో మధ్యమ హల్దార్, రాజా చక్రవర్తి, అర్పితా డే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఆబిసోన్ యమ్నం దర్శకత్వం వహించగా.. ప్రథమేశ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. కథా కథనం శృతి పార్ధ సారథి, ఎడిటిండ్ అంకిత్ ప్రకాశ్, ఆర్ట్ స్వరాజ్ సిద్ధార్థ్ అందించారు.