విడుదలైన మూడు దశాబ్దాల తర్వాత కూడా.. ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నది. షారుక్ ఖాన్-కాజోల్ జంటగా వచ్చిన ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ.. భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తాజాగా, ఈ సినిమా షూటింగ్ కష్టాలను పంచుకున్నాడు ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు.. కరణ్ జోహార్. ‘దిల్వాలే దుల్హనియా..’ చిత్రానికి కరణ్ జోహార్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. షారుక్ (రాజ్) స్నేహితుడు రాకీగా తెరపైనా కనిపించాడు.
ఇటీవల తన పోడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘దిల్వాలే దుల్హనియా..’ షూటింగ్ సంగతులను చెప్పుకొచ్చాడు. సినిమాలో ముఖ్యమైన సన్నివేశాలు.. స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించారు. అయితే.. బడ్జెట్, ఇతరత్రా కారణాల వల్ల చాలా తక్కువమంది అక్కడికి వెళ్లారట. కేవలం 21 మందితోనే నెట్టుకొచ్చారట. ‘21 మందితోనే స్విట్జర్లాండ్ షూటింగ్ పూర్తిచేశాం. అన్ని పనులూ వాళ్లే చేసుకున్నారు.
అందరం కలిసి ఒకే బస్సులో ప్రయాణించేవాళ్లం. దర్శకుడు ఆదిత్య చోప్రా.. ఎక్కడ అందమైన ప్రదేశాలు కనిపిస్తే అక్కడ బస్సు ఆపేవాడు. యూనిట్ మొత్తం బస్సు దిగేసి.. అక్కడికక్కడే షూటింగ్ చేసేవాళ్లం’ అంటూ నాటి సంగతులను గుర్తుచేసుకున్నాడు. ఇక సరైన సౌకర్యాలు లేకపోవడంతో హీరోయిన్ కాజోల్.. చెట్ల వెనకాల దుస్తులు మార్చుకునేదట. సహాయం చేయడానికి తగినంత సిబ్బంది కరువై.. సినిమా నటులే ఆఫీస్ బాయ్‌లుగా అవతారమెత్తారనీ, గుట్టలపైకి సామగ్రిని మోసుకెళ్లి.. షాట్లను సెట్ చేయడంలో సహాయపడ్డారని చెప్పాడు కరణ్.
‘కాజోల్ మేకప్ ఆర్టిస్ట్ స్విట్జర్లాండ్‌కు వీసా పొందలేకపోయారు. దాంతో, ఆమె తల్లి మేకప్ చేస్తుంటే.. నేను సహాయం చేసేవాణ్ని. ఒక పాటలో కాజోల్ చీర కట్టుకోవాల్సి వచ్చింది. అయితే, అక్కడ ఉన్న ఎవరికీ చీర ఎలా కట్టాలో తెలియదు. చీరకట్టే విధానం నాకు కొంచెంగా తెలుసు. దాంతో ఏవో తంటాలు పడి.. నేనే కట్టేశా!’ అంటూ చెప్పుకొచ్చాడు. చిన్న టీమ్ అయినప్పటికీ.. సినిమా కోసం అందరూ కలిసి పనిచేసిన స్ఫూర్తిని ఈ సందర్భంగా కరణ్ జోహార్ గుర్తు చేసుకున్నాడు. అందుకే.. ఈ సినిమాది ‘సమిష్టి విజయం’ అంటూ కొనియాడాడు.