Kantara Chapter 1 review | అంచనాలు లేకుండా వచ్చి సంచలనాలు సృష్టించింది రిషబ్ శెట్టి కాంతార. తెలుగులో కూడా ఊహించని విజయం సాధించింది. అప్పటికి రిషబ్ శెట్టి అంటే ఎవరో ఇక్కడ పెద్దగా తెలీదు, అలాగే కాంతార నేపథ్యంతో కూడా పరిచయం లేదు. కానీ సినిమా మ్యాజిక్ చేసింది. ఇపుడా సినిమాకి సీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 వచ్చింది. సహజంగానే సినిమాపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలని చాప్టర్ 1 అందుకుందా? కాంతార మ్యాజిక్ రిపీట్ అయ్యిందా?
8వ శతాబ్దం కదంబుల రాజ్యంలో జరిగే ఈ కథలో అటవీ ప్రాంతమైన కాంతారను గిరిజన తెగ కాపాడుతుంది. ఆ ప్రాంతాన్ని ఈశ్వరుడి పూదోట అని పిలుస్తుంటారు. ఈశ్వరుడి పూదోట సుగంధ ద్రవ్యాలకు నిలయం. అక్కడి దైవిక బావిలో దొరికిన శిశువును “బెర్మే” (రిషబ్ శెట్టి) అని పేరుపెట్టి పెంచుతారు. ఒకసారి భాంగ్రా యువరాజు కులశేఖర (గుల్షన్ దేవయ్య) దాడి చేయగా, బెర్మే అతనిని ఎదుర్కొంటాడు. తర్వాత గిరిజనులపై జరుగుతున్న వెట్టి, సుగంధ ద్రవ్యాల వ్యాపార దోపిడీ గురించి తెలిసి, స్వతంత్రంగా వ్యాపారం చేయాలని నిర్ణయిస్తాడు. తర్వాత ఏం జరిగింది? ఈ కథలో భాంగ్రా రాజు రాజశేఖర్ (జయరామ్), ఆయన కుమార్తె కనకావతి (రుక్మిణి వసంత్) పాత్రల ప్రాధన్యత ఏమిటి? ఈశ్వరుడి పూదోటలోని దేవరహస్యం ఎమిటనేది మిగతా కథ.
‘కాంతార’ కథ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ఈ ప్రీక్వెల్ మొదలవుతుంది. 8వ శతాబ్దం కదంబుల కాలంలో కాంతారా అనే దైవిక భూమి, ఈశ్వరుడి పూదోట, మార్మిక బావి వెనకున్న రహస్యాలే ఆసక్తికరంగా వుంటాయి. అక్కడ గిరిజన తెగల జీవనం, రాజుల అణచివేత, సుగంధ ద్రవ్యాల వ్యాపారం, వెట్టి దోపిడీ ఈ నేపధ్యాలు లావిష్ కాన్వాస్ పై చిత్రీకకరించారు. సినిమా తొలి భాగం కొంచెం నెమ్మదిగా సాగినా, రెండో భాగంలో యాక్షన్, దైవిక సీక్వెన్సులు ప్రేక్షకులను ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాయి. టైగర్ సీక్వెన్స్, గులిగలా మారి బెర్మే చేసిన రుద్రతాండవం, క్లైమాక్స్‌లో శివ, చాముండి దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కాకపొతే కాంతారలో ఒక మ్యాజిక్ జరిగింది. సెకండ్ హాఫ్ ఆ సినిమాని కాపాడింది. చాపర్ట్ వన్ విషయానికి వస్తే.. మంచి క్లైమాక్స్ కుదిరింది కానీ అంతకుముందు కథ చాలా చోట్ల ట్రాక్ తప్పింది. కాంతారకి మించిన థ్రిల్ ఆశిస్తే మాత్రం కొంత నిరాశ తప్పుదు. కాంతార లాంటి క్లైమాక్స్ వుంటే సరిపొతుందని భావిస్తే మాత్రం చాప్టర్ 1కి పాస్ మార్కులు పడిపోతాయి.
రిషబ్ శెట్టి మళ్ళీ తన విశ్వరూపం చూపించాడు. దర్శకుడిగా నటుడిగా తనది వన్ మ్యాన్ షో. మరోసారి పూనకాలు తెప్పించాడు. కనకావతి పాత్రలో రుక్మిణి ఆకట్టుకుంది. జయరామ్ కి కూడా బలమైన పాత్ర దక్కింది. కులశేఖర పాత్రని ఇంకా బలంగా తీర్చిదిద్దాల్సింది. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
టెక్నికల్ గా సినిమా రిచ్ గా వుంది. అటవీ నేపధ్యం స్క్రీన్ కి ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. కెమెరా వర్క్ బ్రిలియంట్ గా వుంది. యాక్షన్ కొరియోగ్రఫీకి మంచి మార్కులు పడతాయి. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో బిగ్ ఎసెట్. మంచి విజువల్ ఎఫెక్ట్స్ కుదిరాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా వున్నాయి.
రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం
డివైన్ ఎలిమెంట్స్ ,విజువల్స్, సంగీతం
ఫస్ట్ హాఫ్ నెమ్మది
కొన్ని పాత్రల్లో ఇంపాక్ట్ తగ్గడం
రేటింగ్ 3 /5