 
                                                            Kantara Chapter 1 |నిర్మాతలకు ఓటీటీ హక్కులు ఇప్పుడు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. థియేటర్లలో అంతగా రాణించని సినిమాలకు ఓటీటీ డీల్స్ మంచి లాభాలను తెస్తున్నాయి. కానీ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రాల విషయంలో మాత్రం నిర్మాతలు ఓటీటీ విడుదలను వీలైనంత ఆలస్యం చేయాలని చూస్తారు. బాలీవుడ్లో సాధారణంగా 8 వారాల గ్యాప్ ఉంటే, దక్షిణాదిలో 4 వారాల వ్యవధిలోనే ఓటీటీ రిలీజ్ చేస్తారు. అయితే తాజాగా కొన్ని సినిమాలు మళ్లీ 8 వారాల గ్యాప్ తీసుకుంటున్నాయి. అయితే ఈ సారి ఆ రూల్ను బద్దలు కొట్టిన చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 31 నుంచి ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. రిలీజ్ అయిన 28 రోజుల్లోనే ‘కాంతార చాప్టర్ 1’ ప్రపంచవ్యాప్తంగా ₹821.5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంకా థియేటర్లలో హౌస్ఫుల్ షోస్ కొనసాగుతున్న సమయంలోనే ఓటీటీ రిలీజ్ ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత త్వరగా ఓటీటీకి రావడానికి కారణం నిర్మాతలు తీసుకున్న నిర్ణయం కాదు, మూడు సంవత్సరాల క్రితం కుదిరిన ఓటీటీ ఒప్పందం. అప్పుడు సినిమా ఇంత భారీ విజయం సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. హిందీ వెర్షన్ మాత్రం 8 వారాల తర్వాతే విడుదల కానుంది.
నిర్మాతల అభిప్రాయం ప్రకారం, ఓటీటీ రిలీజ్ వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపదని నమ్మకం. థియేటర్లలో ఇప్పటికీ దూకుడు కొనసాగుతుండటంతో, ‘కాంతార చాప్టర్ 1’ మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంతార చాప్టర్ 1 చిత్రం కన్నడ సినీ ఇండస్ట్రీలోనే కాక దేశ వ్యాప్తంగా కూడా పలు రికార్డులు నమోదు చేసింది.
 
                            