Kantara | కన్నడలో విడుదలై సూపర్ హిట్ సాధించిన కాంతార చిత్రం ఆ తర్వాత దేశ వ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 రూపొందుతుంది. ఈ మూవీ చుట్టూ ఎన్నో రహస్యాలు, అపోహలు తిరుగుతున్నాయి. పౌరాణిక శక్తుల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై దాగి ఉన్న శక్తులు అడ్డుపడుతున్నాయనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా చిత్రబృందంలోని కొందరి మరణాలు, సెట్స్‌లో జరుగుతున్న ప్రమాదాలు ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. ఇప్పటివరకు ఈ సినిమా టీమ్‌లో నలుగురు సభ్యులు మృతి చెందడంతో పాటు, ఇటీవల చిత్రంలో కనిపించిన దున్నపోతు కూడా మృతి చెందడం వల్ల ఈ విషయాలు మరింత చర్చనీయాంశంగా మారాయి.
మీడియా కూడా ఈ కథనాలను హైలైట్ చేస్తోంది.దీంతో, కాంతార టీమ్‌ను ఏదో దుష్టశక్తి వెంటాడుతోందా? అనే సందేహాలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి. అయితే ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడంతో అపోహలు మరింత పెరిగాయి. ఎట్టకేలకి చిత్ర నిర్మాత చలువే గౌడ తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ .. “మా సినిమాపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. కొన్ని తప్పుడు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి, కొన్ని ప్రమాదాలు నిజమే అయినా, ఎవరికీ పెద్ద నష్టం జరగలేదు. 2025లో ఒకసారి సెట్లో అగ్నిప్రమాదం జరిగింది. కానీ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అదే సమయంలో, ఒక నదిలో పడవ మునిగిన ఘటనలో కెమెరాలు, పరికరాలు మాత్రమే నష్టపోయాయి. ప్రాణ నష్టం లేదు. దయచేసి అసత్యాలను ప్రచారం చేయొద్దు అని క్లారిటీ ఇచ్చారు.
అలాగే, సినిమా చిత్రీకరణకు ముందు పంజుర్లి అమ్మవారిని దర్శించుకున్నామని, ఆమె దివ్యదర్శనంలో కొన్ని అడ్డంకులు వచ్చినా, చిత్రీకరణ విజయవంతంగా పూర్తవుతుందని చెప్పారని అన్నారు.రోజూ తెల్లవారుఝామున 4గం.లకు లేచి, 6గం.లకు షూటింగ్ మొదలుపెట్టేవాళ్లం. మధ్యలో విమర్శలు ఎదురైనా, ఇప్పుడు ఫుటేజ్ చూసి చాలా సంతృప్తిగా ఉంది అని కూడా వెల్లడించారు. ఈ మూవీని అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు.