Kantara 2 | కన్నడ సూపర్ హిట్ చిత్రం కాంతార ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార 2 రూపొందుతుంది. రిషబ్ శెట్టి నటిస్తూ ఈ ప్రీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నాడు. 80వ దశకం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రిషబ్‌శెట్టి పాత్ర చిత్రణ, మేకోవర్ సరికొత్తగా ఉండనున్నాయట. గత కొద్ది రోజులుగా మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే చిత్ర బృందాన్ని వరుస మరణాలు ఆందోళనకి గురి చేస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన దగ్గరి నుంచి వరుస అపశ్రుతులు చోటు చేసుకుంటుండడంతో చిత్ర బృందం కూడా కలవర చెందుతుంది. ఆ మధ్య సినిమా ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.
షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న మినీ బస్సు కొల్లూరు సమీపంలోని జడ్కల్ సమీపంలో బోల్తా పడింది. దాంతో ఆరుగురు గాయపడ్డారు. ఆ తర్వాత, ఆ బృందంలోని ఇద్దరు ఆర్టిస్టులు మరణించారు. మే 12న ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి కి స్నేహితుడిగా నటిస్తున్న రాకేష్ పూజారి గుండెపోటుతో మృతి చెందడం టీమ్‌ని, హీరో రిషబ్ శెట్టిని షాక్‌కు గురి చేసింది.కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్ కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి కన్నుమూశాడు. ‘ఆ రోజు షూటింగ్ జరగలేదు. కాబట్టి, దీనికి ‘కాంతార’ చిత్రానికి మధ్య ఎటువంటి సంబంధం లేదు’ అని కాంతార బృందం క్లారిటీ ఇచ్చింది. తాజాగా నటుడు విజు వికె ఛాతి నొప్పితో ప్రాణాలు కోల్పోయాడు. 55 ఏళ్ల వయసు కలిగిన ఈ నటుడు షూటింగ్ కోసం బస చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చినట్లు చిత్ర బృందానికి తెలియజేశారు.
అయితే విజును అంబులెన్స్‌లో తీర్థహళ్లిలోని జెసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో తుదిశ్వాస విడిచారు. ఇలా ఒకదాని తర్వాత ఒక విషాదం జరుగుతుండటం చిత్ర యూనిట్‌ని కలవరపరుస్తుంది. కాంతారని ఓ యజ్ఞంలా భావించి పూర్తి చేస్తున్న రిషబ్ శెట్టికి ఇలా షూటింగ్ దశలోనే వరుస మరణాలు సంభవిస్తుండటం అంతుచిక్కడం లేదట. ఇలా ఎందుకు జరుగుతోంది? వరుసగా టీమ్ మెంబర్స్ ఎందుకు చనిపోతున్నారు అని కన్నడ సినీ ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.