Kantara: Chapter 1 | కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం కాంతార చాప్టర్ 1. ఈ మూవీలో రిషబ్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. ఈ మూవీ సెట్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మూవీలో నటిస్తున్న నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజూ (43) మృతి చెందారు. బెంగళూరులో సినిమా షూటింగ్ జరుగుతుండగా.. గురువారం రాత్రి సెట్లోకి వచ్చిన కళాభవన్ ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే చిత్రబృందం దగ్గరలోని ఆసుపత్రికి తరలించింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ ఘటనపై మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించలేదు. కళాభవన్ మృతి చెందినట్లు అతని మిత్రుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ సాగర్ పేర్కొన్నారు.
ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టిన నుంచి ఏదోరకం వార్తల్లో నిలుస్తూ వస్తున్నది. మొదట వర్షం కారణంగా సినిమా సెట్ ధ్వంసమైంది. ఆ తర్వాత గతేడాది నవంబర్‌లో సినిమాలో నటిస్తున్న జూనియర్ ఆరిస్టులు వ్యాన్ ప్రమాదానికి గురైంది. 20 మంది జూనియర్ ఆర్టిస్టులు ఆ వాహనంలో ఉన్నారు. ఈ ప్రమాదంలో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. గత సంవత్సరం నవంబర్‌లో మూవీలో నటిస్తున్న జూనియర్ ఆర్టిస్టులు వెళ్తున్న వ్యాన్ ప్రమాదం బారినపడింది. కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ నదిలో కొట్టుకుపోయి చనిపోయాడు. అలాగే, మరో నటుడు రాకేశ్ పూజారి గుండెపోటుకు గురై కన్నుమూశారు. వరుస ఘటనలతో సినిమా వార్తల్లో నిలుస్తున్నది. షూటింగ్ ఆలస్యం కావడంతో నిర్మాతలకు ఇబ్బందులు తప్పడం లేదు.
కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 తెరకెక్కుతున్నది. రిషబ్ స్వీయ దర్శకత్వంలో 2022లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార మూవీ.. కన్నడతో పాటు తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ మంచి ప్రశంసలు అందుకున్నది. ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 పేరుతో వస్తున్న సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రిషబ్ తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా.. జయరామ్ కీలకపాత్రలో నటించనున్నారు. కదంబుల కాలంలో సాగే ఆసక్తికర కథాంశంతో మూవీ రానుండగా.. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని మేకర్స్ తీసుకువస్తున్నారు. సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.