Actor Darshan | అభిమాని హత్య కేసు (fan murder case)లో కన్నడ స్టార్ నటుడు దర్శన్ (Actor Darshan)కు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో నటుడికి బెయిల్ ఇచ్చేందుకు (bail plea rejected) దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) నిరాకరించింది. గతేడాది డిసెంబర్లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును సుప్రీం ధర్మాసనం పక్కనపెట్టింది. ఈ మేరకు జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దర్శన్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని పేర్కొంది. బెయిల్ మంజూరు చేయడం విచారణపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. నిందితులు ఎంతటి వాళ్లైనా చట్టానికి అతీతులేం కాదని వ్యాఖ్యానించింది. కస్టడీలో దర్శన్‌కు ఎలాంటి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని జైలు అధికారులకు సూచించింది. అంతేకాదు దర్శన్‌ను త్వరగా అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది.
గతేడాది కర్ణాటకకు చెందిన రేణుకా స్వామి అనే యువకుడు అత్యంత దారుణంగా హత్యకి గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో కన్నడ సూపర్‌స్టార్ దర్శన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడ సహా 16మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పవిత్ర గౌడ (Pavithra Gowda)కు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో దర్శన్ అండ్ టీం రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేసిందని విచారణలో తేలింది. రేణుకా స్వామిని దారుణంగా కొట్టి, కరెంటు షాక్‌లు ఇచ్చినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శరీరంపై అనేక గాయాలను కూడా గుర్తించారు.
ఇక ఈ కేసులో దర్శన్‌కు హైకోర్టు గతేడాది అక్టోబర్‌లో మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే ఏడాది డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దర్శన్‌తోపాటు ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ, మరో ఏడుగురు నిందితులు కూడా బెయిలును పొందారు. అయితే, దర్శన్‌కు బెయిల్ ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఏడుగురి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అయితే విచారణలో దర్శన్‌కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read..
Gallantry Awards | 1,090 మందికి కేంద్ర పతకాలు.. ప్రకటించిన హోం శాఖ
Elephant | ఏనుగు బీభత్సం.. పార్క్ చేసిన కారును ధ్వంసం చేసి.. VIDEO
Oracle Layoffs | ఏఐ ఎఫెక్ట్.. ఒరాకిల్‌లో ఉద్యోగాల కోత..!