Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన చిత్రం ‘క్వీన్’. వికాస్ బల్ దర్శకత్వంలో 2013లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా కంగనాకు నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది. ఒక సాధారణ అమ్మాయి తన పెళ్లి రద్దయ్యాక ఒంటరిగా హనీమూన్‌కు వెళ్లి, అక్కడ తనను తాను ఎలా ఆవిష్కరించుకుంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే తాజాగా ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి.
తాజాగా రాబోతున్న ఈ సీక్వెల్లో కంగనా రనౌత్ మరోసారి ‘రాణి’ పాత్రలో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మొదటి భాగంలో రాణి ప్యారిస్, ఆమ్స్టర్డ్యామ్ వంటి యూరప్ నగరాల్లో పర్యటిస్తే, ఈ ‘క్వీన్ 2’ చిత్రంలో ఆమె ప్రయాణం మన దేశంలోని వివిధ మెట్రో నగరాల చుట్టూ సాగనుందని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. మొదటి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వికాస్ బహ్ల్ ఈ సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో కంగనా మినహా పాత నటీనటులు ఎవరూ ఉండరని, ఎక్కువ శాతం కొత్త థియేటర్ ఆర్టిస్టులను ఎంపిక చేసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న కంగనా ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా డేట్స్ కేటాయించినట్లు సమాచారం. ముంబైలో వేసిన ప్రత్యేక సెట్లో ఏప్రిల్ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని, దాదాపు మూడు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేయబోతున్నట్లు టాక్.