Kangana Ranut | ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలిచే.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం కంగన ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో నటిస్తుండగా.. పార్లమెంట్ ప్రాంగణంలో సినిమా షూటింగ్ కోసం లోక్‌సభ సెక్రెటేరియట్ నుంచి అనుమతి కోరింది. కంగన రాసిన లేఖ పరిశీలనలో ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, షూటింగ్‌కు అనుమతి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఎమర్జెన్సీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా చిత్రీకరణకు అనుమతి ఇవ్వాలని లోక్‌సభ సెక్రెటేరియట్‌కు రాసిన లేఖలో అభ్యర్థించినట్లు ఓ అధికారి తెలిపారు.
పార్లమెంట్ కాంప్లెక్స్ లోపల షూటింగ్, వీడియోగ్రఫీకి ప్రైవేటు సంస్థలకు అనుమతి లేదన్నారు. దూరదర్శన్, సంసద్ టీవీలకు మాత్రమే పార్లమెంట్ లోపల కార్యక్రమాలను షూట్ చేసేందుకు అనుమతి ఉందని తెలిపారు. వ్యక్తిగత పనుల కోసం ఎవరినీ పార్లమెంట్‌లోపల షూట్ చేసేందుకు అనుమతించిన సందర్భం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా.. కంగనా రనౌత్ ప్రధాన ప్రాతలో ‘ఎమర్జెన్సీ’ చిత్రం రాబోతున్నది. సినిమా షూటింగ్ గత జూన్‌లో ప్రారంభమైంది. చిత్రానికి రచన, దర్శకత్వం వహించడంతో పాటు సినిమాను కంగనానే స్వయంగా నిర్మిస్తున్నది. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది.