‘ఆస్తులు అంటే మనకు అవసరమైనప్పుడు అమ్ముకునేవి అని అర్థం. ముంబయి బాంద్రాలోని పాలి హిల్లో ఉన్న నా బంగ్లాను నేను అమ్మేసిన మాట నిజం. 32కోట్లకు దాన్ని అమ్మేశాను. అది నా వ్యక్తిగత విషయం. అదేం దేశ సమస్య కాదు’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది బాలీవుడ్ భామ కంగనా రనౌత్. గత కొన్ని రోజులుగా తన బంగ్లా అమ్మేసినట్లు వస్తున్న వార్తలపై తాజా ఇంటర్వ్యూలో కంగనా స్పందించింది. ‘నా ‘ఎమర్జన్సీ’ సినిమా విడుదల కావాల్సివుంది.
ఆ సినిమా నిర్మాణం కోసం నా ఆస్తుల్ని తనఖా పెట్టాను. కానీ అది విడుదల కాలేదు. దాంతో 2017లో కొన్న ఆ బంగ్లాను అమ్మక తప్పలేదు’ అంటూ వివరణ ఇచ్చింది కంగనా. ఈ ఇంటర్వ్యూలోనే వివాదాస్పద వెబ్ సిరీస్ ‘ఐసీ 814:ది కాందహార్ హైజాక్’ గురించి కంగనా మాట్లాడుతూ ‘ఈ మధ్య ఓటీటీ కంటెంట్ చాలా దారుణంగా ఉంటుంది. వాటిని పిల్లలు చూస్తున్నారు.
వారి మనసులు విషతుల్యం అయితే.. ఆ ప్రభావం భావిభారతం మీద పడుతుంది. అందుకే.. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్లకు కూడా సెన్సార్షిప్ అవసరం. దాన్ని సాధించే దాకా నా పోరాటం ఆగదు’ అంటూ చెప్పుకొచ్చింది.