Kangana Ranaut | ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం కంగనా రనౌత్ స్టయిల్. వ్యక్తిగత విషయాలతోపాటు సినీ పరిశ్రమ, దేశంలో జరుగుతున్న ఘటనలపై తరచూ స్పందిస్తుంటుంది. తాజాగా, సినిమా సెట్లలో నటీమణుల పట్ల ఇతరులు వ్యవహరించే తీరుపై కాస్త ఘాటుగానే స్పందించింది. పరిశ్రమలోని చాలామంది నటులు.. హీరోయిన్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారనీ, అలాంటి అనుభవాలు తనకూ ఇబ్బంది కలిగించాయని చెప్పుకొచ్చింది. తాజాగా, ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
“నేను ఎక్కువమంది హీరోలతో పని చేయలేదు. కానీ, నేను పనిచేసిన వాళ్లలో చాలామంది ‘మర్యాద తెలియని’ వాళ్లే!” అంటూ మండిపడింది కంగనా. అయితే, ఇది కేవలం లైంగిక వేధింపుల గురించి మాత్రమే కాదనీ.. సెట్‌కు ఆలస్యంగా రావడం, మర్యాదగా ప్రవర్తించకపోవడం, హీరోయిన్లను కించపరచడం, వారికి చిన్న కారావ్యాన్ ఇవ్వడం.. ఇలాంటివన్నీ మర్యాదలేని వ్యవహారాలేనని కంగనా అభిప్రాయడింది. “వీటన్నిటినీ నేను చాలా వ్యతిరేకించేదాన్ని.
దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. కేసులు కూడా ఎదుర్కొన్నాను” అంటూ చెప్పుకొచ్చింది. చాలామంది అమ్మాయిలు సర్దుకుపోయినా.. తను మాత్రం అలా ఉండలేకపోయేదట. అందుకే.. తనకు అహంకారమని అందరూ అనుకునేవారంటూ కంగనా ఆవేదన వ్యక్తంచేసింది. ఆమె కెరీర్ విషయానికి వస్తే.. 2006లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ సినిమాతో బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వో లమ్హే, లైఫ్ ఇన్ ఎ మెట్రో లాంటి సినిమాలతో మెప్పించింది. ‘ఫ్యాషన్’ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఈ సినిమాకు 2008లో ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డునూ అందుకున్నది. క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగులోనూ ప్రభాస్ సరసన ‘ఏక్‌నిరంజన్’ చిత్రంలో మెరిసింది.