Bharat Bhagya Vidhata | కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ వర్గం వారిని కించపరిచేలా వివాదాస్పద అంశాలున్నాయని కేంద్ర సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలపడంతో రిలీజ్‌ను వాయిదా వేశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే కంగనారనౌత్ ‘భారత్ భాగ్య విధాత’ పేరుతో కొత్త సినిమాను మొదలుపెట్టింది.
దేశభక్తి ప్రధానంగా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులను త్యాగాలను ఆవిష్కరించబోతున్నామని, ఇప్పటివరకు వచ్చిన దేశభక్తి సినిమాలకు భిన్నంగా ఉంటుందని కంగనారనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. మనోజ్ తపాడియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో పాటు తమిళ హీరో ఆర్.మాధవన్‌తో సైకలాజికల్ థ్రిల్లర్‌లో నటించబోతున్నది కంగనారనౌత్.