తమకు అప్పగించిన పాత్రలకు న్యాయం చేయడానికి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడని నాయికలు అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో కంగనా రనౌత్ ఒకరు. పాత్రల పరంగా ప్రతి సినిమాలో వైవిధ్యతను కనబరుస్తుంటుంది. బాలీవుడ్ చిత్రం ‘ధాక్డ్’లో ఆమె పది అవతారాల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రజనీష్ ఘాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కథానుగుణంగా ఈ సినిమాలో కంగనా రనౌత్ సీక్రెట్ ఏజెంట్, బార్ డ్యాన్సర్, వేశ్యతో పాటు పది పాత్రల్లో కనిపిస్తుందని సమాచారం. ప్రతి క్యారెక్టర్ విభిన్నమైన వేషధారణ, లుక్తో కొత్తగా ఉంటాయని చెబుతున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో కంగనాపై పోరాట ఘట్టాలను చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆమె పధ్నాలుగు కిలోల మేర బరువు తగ్గినట్లు సమాచారం.