Kamini Kaushal | బాలీవుడ్ సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ ప్రముఖ నటి కామిని కౌశల్ (Kamini Kaushal) 98 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చివరి శ్వాస విడిచారు. ఆమె మరణ వార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు, హిందీ సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. 1927 జనవరి 24న లాహోర్‌లో జన్మించిన కామిని అసలు పేరు ఉమా కశ్యప్. చిన్నప్పటి నుంచే కళలంటే ఆసక్తి ఉన్న ఆమె కేవలం ఏడు ఏళ్ల వయసులో తన తండ్రిని కోల్పోయింది.
అయితే ప్రతిభతో ముందుకు సాగిన కామిని, తన బాల్యంలోనే తోలుబొమ్మ థియేటర్ రూపొందించి, ఆల్ ఇండియా రేడియోలో రేడియో నాటకాలు ప్రదర్శించడం ద్వారా తన ప్రతిభను నిరూపించింది. ఆమె గొంతు, నటనకి ముగ్ధుడైన దర్శకుడు చేతన్ ఆనంద్, ఆమెకు తన భార్య పేరు (ఉమా ఆనంద్)ను కలిపి “ఉమా కామిని”, తరువాత “కామిని కౌశల్” అనే పేరు పెట్టారు. ఆ పేరుతోనే ఆమె బాలీవుడ్లో గుర్తింపు పొందింది. 1940–60 దశకాల్లో కామిని కౌశల్ బాలీవుడ్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించారు. ఆమె నటించిన చిత్రాల్లో బిరాజ్ బహు (1954), ఆర్జూ (1950), షబ్నం (1949), జిద్ది (1948), ఆగ్ (1948), నదియా కే పార్ (1948), షహీద్ (1948) వంటి బ్లాక్బస్టర్లు ప్రత్యేకంగా నిలిచాయి.
కామిని కౌశల్ నటనా దశాబ్దాలను దాటి కొనసాగింది. ఆధునిక ప్రేక్షకులకు కూడా ఆమె చిరపరిచితమే. షారుఖ్ ఖాన్ – దీపికా పదుకొనె నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ లో షారుఖ్ అమ్మమ్మ పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్నారు. కామిని కౌశల్ మరణం బాలీవుడ్‌కే కాదు, మొత్తం భారతీయ సినీ ప్రపంచానికి పెద్ద నష్టం. ఆమె నటన, వినయం, క్రమశిక్షణకు ఎన్నో తరాల ప్రేక్షకులు సాక్ష్యం. పలువురు నటులు, దర్శకులు సోషల్ మీడియాలో ఆమె సేవలను స్మరించి నివాళులు అర్పిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నక్షత్రం ఈరోజు అస్తమించింది అని కొందరు కామెంట్ చేస్తున్నారు.