‘ఈ ప్రయాణంలో నాతో ఎందరో ఉన్నారు. ఇప్పటికీ వారు నాతో ప్రయాణిస్తూనే వున్నారు. నా గుండెల్లో సంతోషంతో కూడిన కన్నీరుంది. అలాగే బాధతో నిండిన కన్నీరు కూడా ఉంది. ఎన్నో తరాలుగా నన్ను ఆరాధిస్తున్న అభిమానదేవుళ్లకు ధన్యవాదాలు తప్ప మరేం చెప్పలేను.’ అన్నారు కమల్‌హాసన్.. ‘నాయకన్’ వచ్చిన 38ఏండ్ల విరామం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్‌లైఫ్’. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో భారీగా నిర్వహించిన ఆడియో లాంచ్ వేడుకలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ కమల్‌హాసన్ భావోద్వేగానికి లోనయ్యారు.
ఇంకా ఆయన చెబుతూ ‘ఈ ఆడియో వేడుకలో ముందు ఏ.ఆర్.రెహమాన్ గురించి చెప్పాలి. ఇళయరాజా తర్వాత సంగీతంలో నన్ను ఆ స్థాయిలో ముంచెత్తింది రెహ్మానే. ఈ సినిమాకు అద్భుతమైన పాటలిచ్చారాయన. నన్నూ, మణిరత్నంని సినిమా కలిపింది. మాకంటే మా ఇద్దరి సినిమానే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారని నాకు తెలుసు.
ఈ సినిమా మీ ఆకలి తీరుస్తుంది. అద్భుతమైన టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. శింబు, త్రిష, అభిరామి, నాజర్, జోజో జార్జ్ వంటి గొప్ప నటీనటులు ఇందులో భాగం అయ్యారు. ఈ సినిమా తప్పకుండా అందర్నీ మెప్పిస్తుంది.’ అని కమల్‌హాసన్ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా శింబు, మణిరత్నం, కన్నడ హీరో శివరాజ్‌కుమార్, త్రిష, అభిరామి, నాజర్, అశోక్‌సెల్వన్, డీవోపీ రవి కె.చంద్రన్ తదితరులు కూడా మాట్లాడారు.