‘నిర్మాణంలో ఉన్నప్పుడే కొత్త అనుభవాన్నిచ్చిన సినిమా ‘థగ్‌లైఫ్’. నా కెరీర్లో ఎన్నో పాత్రలు పోషించా. కానీ ‘థగ్‌లైఫ్’లో చేసిన శక్తివేల్రంగరాయన్ పాత్ర నిజంగా ప్రత్యేకం. దర్శకునిగా మణిరత్నంలో చాలా మార్పు చూశాను. ఆయనలోని కంప్లీట్ డైరెక్టర్ని ‘థగ్‌లైఫ్’లో చూస్తారు. ఈ సినిమాకు పనిచేసిన వారంతా ప్రతిభావంతులే. అందుకే చెబుతున్నా.. ‘నాయకన్’ కంటే నెక్ట్స్ లెవల్లో ఉంటుందీ సినిమా. నటుడిగా ఇతర భాషలో పరిచయమైనా స్టార్‌గా నాకు జన్మనిచ్చింది మాత్రం తెలుగు సినిమానే. జనరేషన్స్ మారుతున్నా నన్ను ఆదరిస్తున్నందుకు ఆడియన్స్‌కి థ్యాంక్స్. థియేటర్లలో మీ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నా.’ అని కమల్‌హాసన్ అన్నారు. ఆయన హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక పానిండియా చిత్రం ‘థగ్‌లైఫ్’.
కమల్‌హాసన్, మణిరత్నం, మహేంద్రన్, శివ అనంత్, ఉదయ్‌నిధి మారన్ నిర్మాతలు. శ్రేష్ట్ మూవీస్ ద్వారా ఈ చిత్రాన్ని ఎన్.సుధాకర్‌రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. జూన్ 5న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో కమల్‌హాసన్ మాట్లాడారు. మణిరత్నం మాట్లాడుతూ ‘ ‘మౌనరాగం’ టైమ్‌కి నేను చిన్న దర్శకుడ్ని. నాపై నమ్మకంతో ‘నాయకన్’ అవకాశమిచ్చారు కమల్. ఆ సినిమా లేకపోతే నేను లేను. ఇప్పుడు 38ఏండ్ల తర్వాత ‘థగ్‌లైఫ్’ చేశానంటే కారణం కూడా ‘నాయకన్’ సినిమానే. కమల్‌తో పనిచేయడమే ఓ గొప్ప అనుభూతి. ఇందులో ఆయన శక్తివేల్రంగరాయన్గా కనిపిస్తారు. ఆయన అద్భుతమైన నటనను మరోసారి చూస్తారు.’ అని తెలిపారు. ఇంకా శింబు, సుహాసిని, త్రిష, అభిరామి, నాజర్, తనికెళ్ల భరణి, ఎన్.సుధాకర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.