Kalpika Ganesh | టాలీవుడ్ నటి కల్పిక గణేష్ ఇటీవల వరుస వివాదాలతో వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ‘జులాయి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘యశోద’, ‘హిట్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇటీవల తరచూ వివాదాస్పద ఘటనలతో హాట్ టాపిక్ అవుతుంది. గతంలో హైదరాబాద్‌లోని ప్రిజమ్ పబ్‌లో ఆమె ప్రవర్తనపై పెద్ద హంగామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అక్కడ పబ్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు, పోలీసుల ఎదుటే బూతులు తిడుతూ రెచ్చిపోయిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఘటనపై పోలీసులు ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.
రీసెంట్ గా, నగర శివారులోని ఓ రిసార్ట్‌లో కూడా కల్పిక నానా హంగామా సృష్టించింది. రిసార్ట్ మేనేజర్‌తో పాటు సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించి, వారిపై బూతులు తిడుతూ రచ్చ రచ్చ చేసింది. ఎందుకు ఆమె ఇలా ప్రవర్తించిందో అర్థంకాక, అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. సిగరెట్ అడిగితే పట్టించుకోలేదని, ప్రశాంతత కోసం అక్కడికి వెళ్లినా ప్రశాంతత దక్కలేదని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు షేర్ చేస్తూ గట్టిగా స్పందించింది. అయితే నెటిజన్లు ఆమె ప్రవర్తనపై తీవ్రంగా స్పందించారు. “నీకు మానసిక వైద్యం అవసరం” అంటూ కామెంట్లు చేశారు. ఇదే తరుణంలో కల్పిక గణేష్ తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
తన కుమార్తె మానసిక సమస్యతో బాధపడుతోందని, గతంలో రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించిందని, రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించినా అక్కడ ఉండకుండా తిరిగి వచ్చిందని ఫిర్యాదులో తెలిపారు. ఆమె ఇప్పుడు కుటుంబానికి, సమాజానికి హానికరంగా మారిందని అభిప్రాయపడ్డారు. మరోవైపు, కల్పిక గత రెండు సంవత్సరాలుగా మెడిసిన్ తీసుకోవడం మానేయడంతో డిప్రెషన్‌కి లోనైందని, ఇంట్లో తరచూ గొడవలు సృష్టిస్తున్నదని ఆయన తెలిపారు. ఆమెను మళ్లీ రిహాబిలిటేషన్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తండ్రి నుంచి వచ్చిన ఫిర్యాదుతో కల్పిక పరిస్థితిపై నెటిజన్లలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆమె ప్రవర్తన చూస్తే మానసిక స్థితి క్షీణించినట్టు కనిపిస్తోందని, తక్షణమే వైద్య సహాయం అవసరమని వారు సూచిస్తున్నారు.