అడవులను రక్షించుకొని పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలనే గొప్ప సందేశంతో తెలంగాణ నేపథ్యంలో రూపొందించిన చిత్రం ‘కలివి వనం’. నాగదుర్గ కథానాయికగా పరిచయమవుతున్నది. రఘుబాబు, సమ్మెట గాంధీ, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, విజయలక్ష్మి తదితరులు ప్రధాన పాత్రధారులు. రాజ్ నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్‌రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
శనివారం సినీ జర్నలిస్ట్‌ల చేతుల మీదుగా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తున్నాం. ప్రకృతి లేకపోతే మనం లేము అనే విషయాన్ని చిన్నప్పుడే పిల్లల మెదళ్లలో నాటితే అది వాళ్లతో పాటు పెరిగి మహావృక్షం అవుతుంది. దేవుడితో పాటు ప్రకృతిని పూజించాలి. ప్రేమించాలి అనే అంశాన్ని పిల్లలకు తెలియజెప్పాలనే సంకల్పంతో ఈ సినిమా తీశాం. జగిత్యాల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం’ అని తెలిపారు. మహేంద్రనాథ్, సతీష్, శ్రీచరణ్, అశోక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జి.యల్.బాబు, సంగీతం: మదీన్ ఎస్.కె, రచన-దర్శకత్వం: రాజ్ నరేంద్ర.